అనంతపురం కలెక్టరేట్ : మహిళలు పరుషులతో సమానంగా అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించి ఆదర్శంగా నిలవాలని జిల్లా సీనియర్ సివిల్ జడ్జి దీన పిలుపునిచ్చారు. అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని రెడ్స్ సంస్థ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా నిర్వహించారు. కురుగుంట బాలికల కళాశాలలో నిర్వహించిన కార్యక్రమానికి రెడ్స్ సంస్థ అధినేత్రి భానుజ అధ్యక్షత వహించగా సీనియర్ సివిల్ జడ్జి దీన, జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గిరిజమ్మ, ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి, సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్ రామలక్ష్మి, కళాశాల ప్రిన్సిపల్ అపర్ణ, ఉదయకుమారి హాజరయ్యారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తుండటం శుభపరిణామం అన్నారు. జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ గిరజమ్మ మాట్లాడుతూ బాలికలందరూ క్రమ శిక్షణతో మంచి ప్రవర్తన కలిగి ఉంటే అదే మీ భవితకు బంగారు బాట వేస్తుందన్నారు. సిడబ్ల్యూసి ఛైర్‌పర్సన్ రామలక్ష్మి మాట్లాడుతూ బాలల కోసం చైల్డ్ వెల్ఫేర్ కమిటీ నడుస్తోందన్నారు. ఐసిడిఎస్, ఎన్జీవోలు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. బాలికలు ఏ ఆపద సమయాల్లోనైనా 1098 నెంబర్‌కు ఫోన్ చేస్తే వెంటనే అక్కడికి పోలీసులు, ఐసిడిఎస్ సిబ్బంది వచ్చి రక్షణగా నిలుస్తారని తెలిపారు. ఐసిడిఎస్ పీడీ శ్రీదేవి మాట్లాడుతూ బాలికలకు నాలుగు హక్కులు ఉన్నాయని వాటిని ఉపయోగించుకుని ఉన్నత విద్యలో రాణించాలన్నారు. రెడ్స్ భానుజ మాట్లాడుతూ ఒంటిర మహిళల గురించి రెడ్స్ ప్రత్యేకంగా పని చేస్తోందన్నారు. బాల్య వివాహాల నిర్మూలనకు అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రభుత్వ ఆర్ట్స్ కళాశాల ఎన్‌ఎస్‌ఎస్ విద్యార్థులు బాల్య వివాహాల పై ప్రదర్శించిన నాటిక, పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి.










