Mar 09,2023 01:15
సమావేశంలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి

ప్రజాశక్తి-చీరాల: మనువాదులు మహిళలపై తాలిబన్ల తరహా ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి రమాదేవి పేర్కొన్నారు. బుధవారం స్థానిక ఎన్‌జిఒ భవన్‌లో యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఐద్వా సంఘం రాష్ట్ర కార్యదర్శి రమాదేవి హాజరై మాట్లాడారు. స్త్రీలు చేస్తున్న పనికి ప్రభుత్వ రంగం మినహా మిగిలిన అన్ని రంగాలలో తక్కువ వేతనాలు అందిస్తున్నారని, 96 శాతం అసంఘటిత రంగంలో పనిచేస్తున్న మహిళలకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సంక్షేమ చర్యలను అమలు చేసి, భద్రత కల్పించి ఉపాధి పెంచాలని రమాదేవి డిమాండ్‌ చేశారు. సాంకేతిక నైపుణ్యంలోనూ వివిధ అంశాలను కనుగొనడంలో మహిళ లు వెనుకబడి ఉన్నారని, అటువంటి అంశాల్లో వారికి నైపుణ్యం అవసరం అని పురుషులతోపాటు స్త్రీలు కూడా నైపుణ్యాన్ని అలవర్చుకోగలిగితే ఆ దేశాలు అభివృద్ధి చెందుతాయని ఐక్యరాజ్యసమితి ప్రకటించిందని అన్నారు. భారతదేశంలో మహిళలపై తాలిబన్ల తరహా ఆధిపత్యం కొనసాగుతోందని, నేడు భారత దేశంలో గర్భస్థ శిశువులకే విద్య నేర్పిస్తాం అనే పేరిట గర్భిణులకు నీతి బోధలు చేసే ప్రయోగాన్ని కేంద్రం ప్రభుత్వం, ఆర్‌ఎస్‌ఎస్‌ కుట్రపూరి తంగా ముందుకు తెచ్చాయని అన్నారు. మహిళలను అణిచివేస్తూ పురుషులకు స్త్రీలు లోబడి ఉండాలనే మనుధర్మ శాస్త్రాన్ని, సాంప్రదాయాన్ని కాపాడాలనే పేరుతో పురుషాధిపత్యాన్ని పెంచే భావజాలాన్ని అవలంబిస్తోందని అన్నారు. లైంగిక వేధింపులలోనూ, వరకట్న హత్యలను స్త్రీలవైపే వేలెత్తి చూపే పరిస్థితి ఉందని అన్నారు. కులాంతర వివాహాలు చేసుకున్న పిల్లలను తల్లిదండ్రులే చంపే దుర్మార్గ పరిస్థితి కనిపిస్తుందని, ఈ నేపథ్యంలో విద్యారంగంలో కానీ, వ్యవస్థల్లో కానీ భారత రాజ్యాంగాన్ని నెలకొల్పాల్సిన ప్రభుత్వం దానికి భిన్నమైన విద్యా విధానాన్ని తీసుకురావటమే కాకుండా టెక్నాలజీ, ఇంగ్లీషు మీడియం పేరిట పిల్లల మనసులను కలుషితం చేస్తున్న వైఖరులు చేపట్టడం అందరికీ నష్టమని అన్నారు. ఉపాధ్యాయ, విద్యా రంగంలో పనిచేస్తున్న వారందరినీ ఆందోళనకు గురిచేస్తోందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా మహిళా లోకం పెద్దఎత్తున ఉద్యమించాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కారంచేడు మండల నాయకురాలు ఆర్‌ పద్మావతీ అధ్యక్షతన జరిగిన సమావేశంలో అంజమ్మ, డి శ్రీలక్ష్మి, ఎం భారతి, భారతి దేవి, బి పద్మ, జ్యోతి, నాగమల్లేశ్వరావు, కుర్రా శ్రీను, బాబూరావు అనీల్‌, పలువురు యూటీఎఫ్‌ నాయకులు పాల్గొన్నారు.