ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు స్వరూపరాణి
ప్రజాశక్తి-విజయవాడ : ఆడపిల్లలు, మహిళలపై రోజు రోజుకు పెరుగుతున్న వేధింపులను నివారించడంలో చట్టాలు ఉపయోగ పడటం లేదని ఐద్వా రాష్ట్ర ఉపాధ్యక్షులు కె స్వరూపరాణి అన్నారు. నవంబర్ 25 హింసా వ్యతిరేకదినోత్సవం సందర్భంగా ఐద్వా సెంట్రల్ సిటీ కమిటీ ఆధ్వర్యంలో శ్రీ విద్యా జూనియర్ కాలేజీలో మహిళలు, ఆడపిల్లలపై హింసపై సెమినార్ జరిగింది. ఈ సందర్భంగా స్వరూపరాణి మాట్లా డుతూ ఆడపిల్లలు అన్ని రంగాలలో ముందున్నారని అయినా ఆడపిల్లల పై రోజు రోజు కు వేధింపులు పెరుగుతున్నాయని అన్నారు. మహిళలకు రక్షణ చట్టాలు ఉన్నా వాటి అమలులో లోపాలు జరుగుతున్నాయని అన్నారు. ఇటీవల ఐక్యరాజ్య సమితి జనరల్ సెక్రటరీ మాట్లాడుతూ భారతదేశంలో మహిళలపై లైంగిక దాడులు పెరిపోతున్నాయని, మన దేశంలో మహిళలకు రక్షణ కరువైందని ఆయన కంటతడి పెట్టుకున్నారంటే దేశంలో మహిళలకు ఉన్న భద్రత ఏపాటితో ఇట్టే తెలిసిపోతోందన్నారు. బాబాలు , స్వామీజీలు మహిళలపై నిత్యం అనుచిత వ్యాఖ్యలు చేస్తూ, ప్రవచనాల పేరుతో మహిళలను తక్కువ చేసి మాట్లాడుతున్నారని అన్నారు.యువత మంచి, చెడు తెలుసుకొని తమ లక్ష్యం దిశగా వెళ్ళాలని అన్నారు. విద్యలో బాలికలు రాణించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈకార్యక్రమంలో ఐద్వా సెంట్రల్ సిటీ కార్యదర్శి ఝాన్సీ, నాయకులు దేవికుమారి, అమ్ములు, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










