Aug 02,2023 21:35

కడప : సభలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రమాదేవి

  ప్రజాశక్తి-బద్వేలు/కడప అర్బన్‌/ప్రొద్దుటూరు ;దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలు, చిన్నారులపై రోజురోజుకూ దాడులు, హింస విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. మహిళల రక్షణ కోసం ఐద్వా ఆధ్వర్యంలో మహిళల పోరుయాత్ర రాష్ట్ర జాతా బుధవారం నెల్లూరు జిల్లా నుంచి కడప జిల్లాలోకి ప్రవేశించింది. బద్వేలు, కడప, మైదు కూరు మీదుగా ప్రొద్దుటూరు వరకూ సాగింది. ఆయా ప్రాంతాల్లో సభలు నిర్వ హించారు. బద్వేలులో ఐద్వా జిల్లా కడప జిల్లా కార్యదర్శి ఐ.ఎన్‌.సుబ్బమ్మ జాతాను ప్రారంభించారు. ఈ సందర్భంగా రమాదేవి మాట్లాడుతూ మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని, హింస లేని సమాజం కోసం చేయి చేయి కలుతుదామని తెలిపారు. మహిళల రక్షణే తమ లక్ష్యం అంటూ గద్దెనెక్కిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు మహిళల రక్షణ కోసం చట్టాలను చేయడం కాదు ఆ చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించాలని, దేశంలోనూ, రాష్ట్రంలోనూ చిన్నారులపై, మహిళలపై హింస రోజు రోజుకి విపరీతంగా పెరుగుతున్నదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతి నిత్యం దేశంలో ఎక్కడో ఒకచోట మహిళలు హింసకు గురవుతున్నారన్నారు. మహిళా రక్షణ కోసం తీసుకొచ్చిన పోక్సో చట్టాన్ని ఎత్తి వేయడానికి ప్రయత్నాలు చేస్తు న్నారన్నారు. మత్తు, మద్యం వల్లే నిత్యం మహిళలు హింసకు, దాడులకు గురవు తున్నారని వీటిని సంపూర్ణంగా నిషేధిం చాలన్నారు. ముఖ్యమంత్రి జగన్‌ మోహన్‌రెడ్డి అధికారంలోకి రాక ముందు అధికారంలోకి వచ్చిన వెంటనే దశల వారీగా మధ్య నిషేధం చేస్తామని చెప్పా రని పేర్కొన్నారు. మద్య నిషేధ చట్టాన్ని తీసుకురాక పోగా మత్తు పదార్థాలను విచ్చలవిడిగా దొరికే విధంగా చేశార న్నారు. బిజెపి ప్రభుత్వం దేశాన్ని, దేశ సంపదను, ఖనిజాలను అదాని, అంబా నీలకు దారాదత్తం చేస్తున్నారన్నారు. ఆర్టికల్‌ 370 రద్దుచేసి కాశ్మీర్‌ భూములపై అదాని, అంబానీల పెత్తనం చలాయించే విధంగా చేశారన్నారు. మణిపూర్‌లో ఆదివాసులు నివాసం ఉంటున్న ప్రాంతాల్లో విలువైన ఖనిజ సంపద ఉందని తెలుసుకొని ఆ సంపదను అదానికి దోచిపెట్టడానికి దేశ ప్రధాని నరేంద్రమోడీ రిజర్వేషన్‌ పేరుతో కులాల మధ్య చిచ్చు రేపి హత్యలు హత్యాచారాలకు పాల్పడుతున్నారన్నారు. మహిళల డిమాండ్ల సాధన కోసం రాష్ట్రంలో రెండు ప్రాంతాల నుంచి పోరు యాత్రను చేపట్టామన్నారు. ఈ నెల 8న విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేసి మహిళల పోరు ఏమిటన్నది ప్రభుత్వాలకు చూపిస్తామన్నారు. కార్యక్రమంలో కడప జిల్లా ఐద్వా అధ్యక్షులు ఐ.ఎన్‌.సుబ్బమ్మ, జిల్లా కమిటీ సభ్యులు మేడా గౌతమి, పట్టణ అధ్యక్షులు గంప అనంతమ్మ, ప్రధాన కార్యదర్శి రత్తమ్మ, పట్టణ నాయకులు బాలమ్మ, మస్తాన్‌ బి.మోక్షమ్మ, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ముడియం చిన్ని, పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు షేక్‌ మస్తాన్‌ షరీఫ్‌, గంగనపల్లె నాగార్జున, మహిళా కన్వీనర్‌ సి.గురుదేవీ, పట్టణ నాయకులు ఆంజనేయులు, సురేష్‌, సురేంద్ర, సిఐటియు నాయకులు రాజగోపాల్‌, కాకర్ల బాబయ్య పాల్గొన్నారు.
అవిశ్వాస తీర్మానంపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలి
మణిపూర్‌ సంఘటనలపై పార్లమెంటులో విపక్షాలు ప్రవేశపెట్టిన అవిశ్వాస తీర్మానంపై రాష్ట్రంలోని వైసిపి, టిడిపి, జనసేన తమ వైఖరిని ప్రక టించాలని ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి.రమాదేవి డిమాండ్‌ చేశారు. కడప బాలికల కళాశాలలో ఐద్వా ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలోని మహిళలను సిఎం జగన్మోహన్‌రెడ్డి అక్కలు, చెల్లెలుకు అండగా ఉంటారా లేదా అనేది స్పష్టం చేయాలన్నారు. టిడిపి తట స్థంగా ఉంటామనడం అంటే గోడమీద పిల్లి లాంటి వేషాలేనని విమర్శించారు. జనసేన ప్రశ్నించేందుకే ఉంది అంటున్న పవన్‌ కళ్యాణ్‌ మణిపూర్‌ హత్యలు హత్యాచారాలపై ప్రశ్నించాలన్నారు. రాష్ట్రంలో అదృశ్యమైన మహిళలను ఎంత మందిని గుర్తించారో శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఎంతమందికి పునరావాసం కల్పించారు చెప్పాలన్నారు. జెవివి సమతా విభాగం నాయకులు సునీత మాట్లాడుతూ విద్యార్థినులు సమాజంలో చోటు చేసుకుంటున్న సంఘటనపై ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కోశాధికారి టి.సావిత్రమ్మ, జిల్లా అధ్యక్షులు ఐ.ఎన్‌. సుబ్బమ్మ, నగర కార్యదర్శి జమీల, నాయకులు శంషాద్‌, కామేశ్వరమ్మ, అనంతమ్మ, అంగన్వాడీ యూనియన్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మీదేవి, కళాజాత బృందం, కళాశాల ప్రిన్సిపల్‌ సూర్యారావు, విద్యార్థినులు పాల్గొన్నారు.