ప్రజాశక్తి-కాకినాడ ప్రతినిధి
దేశంలోనూ, రాష్ట్రంలోనూ మహిళలు, చిన్నారులపై రోజురోజుకీ దాడులు, హింస విపరీతంగా పెరిగిపోతున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి. ప్రభావతి ఆవేదన వ్యక్తం చేశారు. ఐద్వా ఆధ్వర్యంలో చేపట్టిన 'హింసపై మహిళల పోరుయాత్ర' జాతా మంగళవారం కాకినాడ జిల్లాలోకి ప్రవేశించింది. తుని గొల్ల అప్పారావు ప్రజాసంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.శ్రీ చైతన్య జూనియర్ కళాశాలలో ఈ సందర్భంగా సభ జరిగింది. అనంతరం పిఠాపురం మీదుగా కాకినాడ చేరుకున్న యాత్ర బందానికి సిఐటియు, మిడ్డే మీల్స్, తదితర సంఘాల నాయకులు, జడ్‌పి సెంటర్లో ఎస్‌ఎఫ్‌ఐ ఆధ్వర్యంలో పిఆర్ జూనియర్ కళాశాల విద్యార్థులు, ఐడియల్ కాలేజీ వద్ద కరస్పాండెంట్ పి.చిరంజీవినీకుమారి, సిబ్బంది, జగన్నాథపురం ఉమెన్స్ కాలేజ్ ప్రిన్సిపాల్ మూర్తి రాజు, విద్యార్థులు పూలతో స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా జరిగిన సభల్లో ప్రభావతి మాట్లాడారు. గతనెల 28న విశాఖపట్నం, హిందూపురం నుుంచి రెండు జాతాలు ప్రారంభమయ్యాయన్నారు. బిజెపి తొమ్మిదేళ్ల పాలనలో మహిళలు, చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందన్నారు. దళితులపై నేరాలు విపరీతంగా పెరిగాయన్నారు. గహహింస అధికమైందన్నారు. రాష్ట్రంలో గంజాయి, మద్యాన్ని, ఫోర్ను వెబ్ సైట్లను నిషేధించాలని డిమాండ్ చేశారు. మణిపూర్ మండుతున్నా, మహిళలను వివస్త్రలను చేసి ఊరేగిస్తున్న బిజెపి ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. మణిపూర్‌లో డబుల్ ఇంజన్ సర్కారు, కేంద్రంలో మోడీ ప్రభుత్వం మణిపూర్ ఘోరాలపై నోరు విప్పకపోవడం శోచనీయమన్నారు. భారత్ మాతాకీ జై అంటూ మహిళలను వేధిస్తున్న బిజెపి ప్రభుత్వం నేరస్తులను కాపాడే ప్రయత్నం చేస్తుండటం దారుణమన్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి చట్ట సభల్లో మహిళలకు రిజర్వేషన్లు ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలు, చిన్నారులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు హింసను అరికట్టే వరకు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఫోక్సో చట్టాన్ని ఎత్తివేయడానికి ప్రయత్నిస్తున్న బిజెపి ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మహిళలంతా ఉద్యమించాలన్నారు. 2020 కంటే 2021లో మహిళలపై నేరాలు 25 శాతం పెరిగినట్లు అధికారిక లెక్కలు చెబుతున్నాయన్నారు. నిర్భయ,దిశ వంటి చట్టాలు ప్రచారానికే పరిమితమయ్యాయని విమర్శించారు. మద్యాన్ని ప్రధాన ఆదాయ వనరుగా చూడడం సిగ్గుచేటన్నారు. మద్యపాన నిషేధాన్ని జగన్ విస్మరించి మహిళలకు అన్యాయం చేస్తున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ వేయాలని, మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, నిందితులను ఫాస్ట్ ట్రాక్ కోర్టుల ద్వారా త్వరితగతిని విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని ఆమె డిమాండ్ చేశారు. కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపులను నిరోధించడానికి అంతర్గత ఫిర్యాదుల కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. హింసను రెచ్చగొడుతున్న బిజెపి ప్రభుత్వాన్ని గద్దధించేందుకు పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. జాతాకు స్వాగతం పలికిన వారిలో సిఐటియు జాతీయ ఉపాధ్యక్షుాలు జి.బేబిరాణి, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి చెక్కల రాజ్ కుమార్, నగర అధ్యక్ష, ఉపాధ్యక్షులు పలివెల వీరబాబు, మేడిశెట్టి వెంకటరమణ, జిల్లా కోశాధికారి మలకా రమణ, జిల్లా ఉపాధ్యక్షురాలు ఏరుబండి చంద్రావతి, జిల్లా సహాయ కార్యదర్శి చంద్రమళ్ల పద్మ, వర్కింగ్ కమిటీ సభ్యులు షేక్ పద్మ, నర్ల ఈశ్వరి, కొప్పిశెట్టి సత్తిబాబు, అంగన్వాడి యూనియన్ జిల్లా కోశాధికారి రమణమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర నాయకుడు టి రాజా జిల్లా కార్యదర్శి ఎం. సూరిబాబు తదితరులు ఉన్నారు.
ఆలోచింపజేసిన ప్రదర్శనలు
జాతా సందర్భంగా ఐద్వా సభ్యుల ప్రదర్శనలు అందర్నీ ఆలోచింపజేశాయి 'ఎక్కడ వచ్చింది స్త్రీకి స్వాతంత్య్రం' నృత్యరూపకం పాలకులు మహిళల పట్ల చూపుతున్న చులకన భావాల ఎత్తిచూపింది. 'ఎక్కడమ్మా నీవు లేనిది' అంటూ ప్రదర్శించిన రూపకం అన్ని రంగాల్లోనూ మహిళల పాత్రను వివరించింది. మద్యపానం వల్ల జరిగే అనర్ధాలను, మహిళలపై జరుగుతున్న దాడులను వివరిస్తూ పలుచోట్ల నాటికలు ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు వై.సత్యవతి, సిహెచ్.రమణి, ఉపాధ్యక్షులు వి.పూర్ణ, జిల్లా కార్యదర్శి కె.వరలక్ష్మి, జిల్లా నాయకులు కె.నాగజ్యోతి, పద్మ, భవాని, భాగ్యలక్ష్మి, మహాలక్ష్మి, వెంకటలక్ష్మి, కుంచే మణి, దుర్గాదేవి, జి.సునీత, ఎస్. ఫాతిమా పాల్గొన్నారు.
పిఠాపురం : మహిళల రక్షణ హక్కులు అందరూ ఐక్యంగా పోరాడి సాధించుకోవాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. హింసపై మహిళల పోరు యాత్ర మంగళవారం పట్టణానికి చేరుకుంది. స్థానిక రాపర్తి జంక్షన్ వద్ద యాత్రకు ఐద్వా, ప్రజా సంఘాల నాయకులు ఘనంగా స్వాగతం పలికారు.అనంతరం స్థానిక ఆర్ ఆర్ బి హెచ్ ఆర్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో కుంచె మణి అధ్యక్షతన ఏర్పాటుచేసిన సభలో ప్రభావతి, రాష్ట్ర కమిటీ సభ్యులు సత్యవతి మాట్లాడారు. ఈ నెల 8న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కె.వెంకటలక్ష్మి, రాజ్యలక్ష్మి,దేవి, సునీత, బి.మణి, సిఐటియు నాయకులు కుంచె చిన్న, కె.విశ్వనాథం, వీరబాబు, అంగన్‌వాడీ నాయకులు డి.పద్మ, సిహెచ్.రమాప్రభ, వివిద సంఘాల నాయకులు కోనేటి రాజు, కె.నాగేశ్వరరావు, డి.సూర్యనారాయణ, ప్రిన్సిపల్ కేశవరావు పాల్గొన్నారు.
సామర్లకోట రూరల్ : పట్టణంలోని అమ్మనమ్మనాయుడు కాలనీ వద్ద యాత్రకు ఐద్వా, అంగన్‌డీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర అద్యక్షులు ప్రభావతి మాట్లాడారు. ఎపిలో 35 వేల మంది మహిళలు, చిన్నారులు అదశ్యమైతే పాలకవర్గాలు ఏం చేస్తున్నాయని ప్రశ్నించారు. జాతాలో బి.లక్ష్మి, టి.నాగమణి, కళాకారులు ఐ దుర్గ, విజయలక్ష్మి, వెంకటలక్ష్మి, విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










