అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు హైమావతి
ప్రజాశక్తి - ఏలూరు
నేడు సమాజంలో మహిళలపై అన్నివైపుల నుంచి దాడులు పెరిగాయని, వారికి రక్షణ లేకుండా పోయిందని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు హైమావతి అన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా ఆధ్వర్యంలో అంతర్జాతీయ స్త్రీ హింస వ్యతిరేక దినోత్సవంలో భాగంగా గురువారం ఏలూరు కోటదిబ్బలోని జూనియర్ కాలేజీలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో హైమావతి మాట్లాడుతూ నేడు స్త్రీలు అనేక సామాజిక, ఆర్థిక, రాజకీయ, విద్యాపరంగా అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారన్నారు. గృహహింస, అత్యాచారాలు, లైంగిక వేధింపులు అధికమయ్యాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఫలితంగా ఆత్మన్యూనతా భావానికి లోనై స్త్రీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని, వీటిని అరికట్టే ప్రయత్నంలో 1999 డిసెంబరు 17న ఐక్యరాజ్యసమితి తీర్మానం చేసిందన్నారు. ఈ మేరకు ప్రతీ సంవత్సరం నవంబరు 25న స్త్రీల హక్కుల పరిరక్షణ, స్త్రీ హింసా వ్యతిరేక దినోత్సవం నిర్వహిస్తున్నారన్నారు. ఆడపిల్లకు ఏమైనా ఇబ్బంది కలిగితే తమను సంప్రదించాలన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి గౌరీ శంకర్ మాట్లాడుతూ 1960లో డొమైన్ రిపబ్లిక్‌లో రాజకీయ నేతలైన మిరాబల్ సిస్టర్స్ హత్య ఆధారంగా స్త్రీ హింసా వ్యతిరేక దినం పాటిస్తున్నట్లు చెప్పారు. ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు కె.లెనిన్ మాట్లాడుతూ ఆడపిల్లకు నేడు రక్షణ లేకుండా పోయిందన్నారు. ఎస్‌ఎఫ్‌ఐ వారికి అండగా ఉంటుందని, మహిళలపై హింసకు పాల్పడితే సహించబోమని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపకులు రాజశేఖర్, విద్యార్థులు పాల్గొన్నారు










