ప్రజాశక్తి-చింతూరు
మహిళలపై జరుగుతున్న హింసను ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని ఐద్వా మండల కార్యదర్శి ముర్రం రంగమ్మ కోరారు. మహిళలపై ఇంట్లో, పని ప్రదేశాలలో హింస, వేధింపులను వ్యతిరేకిస్తూ మండలంలోని ఏడుగురాళ్లపల్లిలో శనివారం ఐద్వా ఆధ్వర్యంలో ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్ చేశారు. పాలకులు చట్టాలను అమలు జరపకపోవడంతో పసి పిల్లల నుంచి పండు ముసలి వాళ్లపైనా అత్యాచారాలు జరుగుతున్నాయని తెలిపారు. అత్యాచారం కేసు కింద జైలుకు వెళ్లిన వారికి విడుదల చేస్తుంటే మహిళలకు రక్షణ ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. మహిళలు చైతన్యమై హక్కుల కోసం ఐక్యంగా పోరాటాలకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఐద్వా మండల అధ్యక్షురాలు మల్లం సుబ్బమ్మ, మడకం గిరిజ, సోడే సిన్నమి, సవలం జయ, పోడియం రాజమ్మ, కారం రాములమ్మ తదితరులు పాల్గొన్నారు.










