ప్రజాశక్తి - పెద్దాపురం మహిళలపై హింసను అరికట్టవలసిన ప్రభుత్వాలు హింసను ప్రోత్సహించేలా వ్యవహరిస్తున్నాయని అఖిల భారత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి అన్నారు. మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని ఐద్వా ఆధ్వర్యంలో జూలై 28న శ్రీకాకుళంలో ప్రారంభమైన జాతా పెద్దాపురం చేరుకుంది. ఈ సందర్భంగా స్థానిక కొండయ్య పేట, మిరపకాయల వీధి, వరహాలయ్యపేటలో ఐద్వా పట్టణ కార్యదర్శి కూనిరెడ్డి అరుణ అధ్యక్షతన జరిగిన కార్యక్రమాలలో ప్రభావతి ప్రసంగించారు. దేశంలో, రాష్ట్రంలోనూ మహిళలపై హింసాకాండ రోజురోజుకు పెరుగుతోందన్నారు. మంత్రులు, ఎంఎల్‌ఎలు, ఎంపీలు సైతం మహిళలపై వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి రాకముందు మద్యాన్ని నియంత్రించి మహిళల కళ్ళల్లో ఆనందాన్ని నింపుతానని ప్రకటించారన్నారు. నేడు మద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చి పాలన సాగించడం వల్ల మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. మహిళలపై జరుగుతున్న హింసాకాండ, అత్యాచారాలకు వ్యతిరేకంగా జరిగే ఉద్యమాలలో మహిళలు ఎక్కువగా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మహిళా సంఘం జిల్లా కార్యదర్శి వరలక్ష్మి, సహాయ కార్యదర్శులు పూర్ణ, రమణి, సత్యవతి, రొంగల సుబ్బలక్ష్మి, టి.పద్మ, లిల్లీ, అమ్ములు, సావిత్రి, సూరమ్మ, అమత, నమ్రత పాల్గొన్నారు.ప్రజానాట్యమండలి కళాకారులు దారపురెడ్డి కృష్ణ, రొంగల వీర్రాజు, దారపురెడ్డి సత్యనారాయణ బృందం గీతాలు ఆలపించారు.










