ప్రజాశక్తి-డుంబ్రిగుడ: బిజెపి అధికారం చేపట్టిన నాటి నుండి మహిళలపై దాడులు, హింస రోజు రోజుకు పెరుగుతున్నాయని ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వివి జయ, గిరిజన మహిళా సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్.హైమా విమర్శించారు. మండలంలోనీ అరకు వారసంతలో శుక్రవారం విస్తతంగా కరపత్రాలు అందిస్తూ ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మహిళలపై దాడులు జరుగుతున్నా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోలేదన్నారు. మహిళలపై జరిగిన అత్యాచారాలపై కేసులు పెట్టినా పరిష్కారం కోసం సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సి వస్తుందన్నారు.ప్రత్యేక చట్టాలు ఉన్నప్పటికీ అమలు కాకపోవడంతో లైంగిక వేధింపులకు గురవుతున్నారని చెప్పారు. అధికారానికి రాకముందు మద్యపానం తగ్గిస్తామని సిఎం జగన్ చెప్పి వచ్చిన తర్వాత దీన్ని ఆదాయం వనరుగా మార్చారని విమర్శించారు.తక్షణమే రాష్ట్రంలో మద్యపానంపై నిషేధం విధించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఐద్వా సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా బస్సుయాత్ర నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ నాయకులు కుమారి, కన్నమ్మ పాల్గొన్నారు.










