ప్రజాశక్తి-పార్వతీపురంరూరల్ : మహిళలపై రోజురోజుకూ పెరుగుతున్న హింసకు వ్యతిరేకంగా ఈనెల 28 నుంచి ఆగస్టు 9వరకు పోరుయాత్ర రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుందని అఖిలభారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) రెడ్డి శ్రీదేవి తెలిపారు. ఈ మేరకు ఆదివారం స్థానిక సుందరయ్య భవనంలో పోరుయాత్రకు సంబంధించిన కరపత్రాలను మహిళా నాయకులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా శ్రీదేవి మాట్లాడుతూ దేశంలోనూ, రాష్ట్రంలోనూ చిన్నారులు, మహిళలపై హింస, హత్యలు, అత్యాచారాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఆఖరుకు ఒలింపిక్స్‌లో బంగారు పతకాలు సాధించిన మహిళా మల్లయోధులు ఢిల్లీలో వారు చేసిన ఆందోళనే ఇందుకు ఒక నిదర్శనమన్నారు. మహిళల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతుందన్నారు. మహిళల కోసం, మహిళా సాధికారత కోసం అనేక చట్టాలు తీసుకొస్తామని చెబుతూనే మహిళలకు రక్షణ లేదన్నారు. బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై హింస మరింత పెరిగిందన్నారు. బిజెపి ఎంపి బ్రిజిభూషన్ లాంటివారు మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినా కేంద్రం పట్టించుకోవడంలేదన్నారు. అలాగే చిన్నారులపైన యథేచ్ఛగా దాడులు, హత్యలు, అత్యాచారాలు జరుగుతున్నా దిశ, నిర్భయ లాంటి చట్టాలు ఎన్ని వచ్చినా మహిళలకు రక్షణ లేదన్నారు. కావున మహిళల సమస్యలపై పోరుయాత్ర రాష్ట్రవ్యాప్తంగా సాగుతుందని, అందులో భాగంగా పార్వతీపురం మన్యం జిల్లాలో ఈనెల 3న జరుగుతుందని, ఇందులో మహిళలంతా పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు వి.రామలక్ష్మి, జి.తులసి, జె.సుందరమ్మ, పి.వరాలు, జి.పార్వతి, మాలతి, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










