ప్రజాశక్తి-ఆలూరు
మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలం చెందాయని ఐద్వా మండల కార్యదర్శి షేకున్‌బీ విమర్శించారు. గురువారం జూనియర్ కళాశాలలో 'హింసపై మహిళల పోరు యాత్ర' గోడ పత్రికలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కేంద్రంలోని బిజెపి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మహిళలు అత్యాచారాలకు, హత్యలకు, దాడులకు గురైన సంఘటనలు ఉన్నాయని తెలిపారు. మీడియా ద్వారా తెలిసిన, తెలియని సంఘటనలు ఎన్నో ఉన్నాయని చెప్పారు. ఢిల్లీలో శ్రద్ధ వాకర్, ముంబయిలో సరస్వతి, ఉత్తరప్రదేశ్ అత్రస్‌లో దళిత మహిళపై, తెలంగాణలో ప్రియాంక, చిన్నారి అసిఫా, రెజ్లర్లు లాంటి బాధితులకు అండగా ఉండాల్సిన బిజెపి మానవ మృగాలకు అండగా ఉంటోందని విమర్శించారు. ఆంధ్ర రాష్ట్రంలో కృష్ణానది తీరంలో యువజంటపై దాడి, గుంటూరులో డెంటల్ విద్యార్థి హత్య, రమ్య హత్య, విశాఖలో వరలక్ష్మి, కర్నూలు జిల్లాలో బాలికపై అత్యాచారం చోటు చేసుకున్నాయని తెలిపారు. వీటిని అరికట్టడంలో విఫలమైన ప్రభుత్వాలను మహిళ లోకం ప్రశ్నించాలని కోరారు. ఐద్వా ఆధ్వర్యంలో ఈనెల 8న అమరావతిలో భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ మహాసభలో మహిళలు పెద్దఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఐద్వా నాయకులు గౌసియాబీ, కోవెలకుమారి, మనుషా, వీరేషమ్మ పాల్గొన్నారు.
గోడ పత్రికలను విడుదల చేస్తున్న నాయకులు










