Jul 21,2023 21:47

సాలూరులో నిరసన ప్రదర్శన చేస్తున్న ఐడ్వా, సిఐటియు నాయకులు

ప్రజాశక్తి - సాలూరు :  మణిపూర్‌లో మహిళలపై అఘాయిత్యాలు, హత్యలు దారుణమని సిఐటియు, ఐద్వా నాయకులు శుక్రవారం ర్యాలీ నిర్వహించారు. సిఐటియు జిల్లా కార్యదర్శి ఎన్వైనాయుడు, ఐద్వా నాయకులు టి.ఇందు ఆధ్వర్యాన మహిళలు మోడీ ప్రభుత్వం తీరును నిరసిస్తూ ర్యాలీ చేపట్టారు. ఈ సందర్భంగా ఎన్వైనాయుడు మాట్లాడుతూ మణిపూర్‌లో గత మూడు నెలలుగా మారణహౌమం జరుగుతుంటే మోడీ ప్రభుత్వం చోద్యం చూస్తుందన్నారు. మే 4న ముగ్గురు మహిళలను అత్యాచారం చేసి, నగంగా ఊరేగించడం సభ్య సమాజం తలదించుకునేలా వుందని చెప్పారు. వీరిలో ఇద్దరిని హత్య చేయడం కిరాతక చర్య అని అన్నారు. మే18న ఈ సంఘటనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేస్తే ఈనెల 19 వరకు తెలియకుండా బిజెపి గోప్యంగా వుంచిందని చెప్పారు. జూలై 19న సోషల్‌ మీడియాలో వచ్చే వరకు ప్రపంచానికి ఈ విషయం తెలియదన్నారు. అత్యంత దారుణం సంఘటనలు జరుగుతున్నా మోడీ ప్రభుత్వం మౌనం వహిస్తుండడం అన్యాయమన్నారు. మణిపూర్‌లో రెండు గిరిజన తెగల మధ్య చిచ్చు రేపి బిజెపి ప్రభుత్వం మౌనం వహిస్తుండడం సరికాదన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు స్వప్న, సీత, సిఐటియు నాయకులు టి.శంకరరావు పాల్గొన్నారు.
కురుపాం : మణిపూర్‌లో ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగింపుగా తీసుకుని వెళ్లిన సంఘట యావత్తు భారతదేశానికే సిగ్గు చేటని, అన్ని వర్గాలు ఈ దుశ్చర్యలను తీవ్రంగా ఖండించాలని ఎపి ఆదివాసీ జాగృతి సంఘం అధ్యక్షులు కె.లక్ష్మణమూర్తి డిమాండ్‌ చేశారు. రాష్ట్రపతిగా గిరిజన మహిళకు అగ్ర స్థానంలో కూర్చొపెట్టి అనేక రాష్ట్రాల్లో ఆదివాసీ తెగల మధ్య గొడవలు సృష్టించి బిజెపి దుష్ట రాజకీయాలకు పాల్పడుతుందన్నారు. ఆదివాసీ మహిళలను నగంగా ఊరేగించిన ఘటనపై మానవ హక్కుల సంఘాలు, సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకారం చేసి నిరసనలు అదుపు చేసేందుకు దేశవ్యాప్తంగా అందరూ తీవ్రంగా ఖండించాలని కోరారు.
కలెక్టరేట్‌ : మణిపూర్‌లో ఇద్దరు గిరిజన మహిళలపై జరిగిన అత్యాచారాలకు బాధ్యత వహిస్తూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయాలని ప్రజాసంఘాలు డిమాండ్‌ చేశాయి. మణిపూర్‌ ఘటనను ఖండిస్తూ ప్రజాసంఘాల నాయకులు శుక్రవారం జాయింట్‌ కలెక్టర్‌ గోవిందరావుకు వినతిపత్రం అందజేశారు. ఇందుకు బాధ్యత వహిస్తూ, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రాజీనామా చేయాలని, దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. వినతిని అందజేసిన వారిలో రైతు కూలీ సంఘం జిల్లా కార్యదర్శి డి .వర్మ, సహాయ కార్యదర్శులు ఎం.భాస్కరరావు, పి.శ్రీను నాయుడు, స్త్రీ విముక్తి సంఘటన రాష్ట్ర కమిటీ సభ్యులు పి.కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.