ప్రజాశక్తి-అనకాపల్లి
మహిళలపై ఇంటా బయటా జరుగుతున్న వివక్ష, అఘాయిత్యాలను రూపుమాపాలని కలెక్టర్ రవి పఠాన్‌శెట్టి పిలుపునిచ్చారు. స్థానిక గాంధీ నగరం సచివాలయం సమావేశ మందిరంలో శనివారం పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల చట్టం-2013పై అవగాహన సదస్సు నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న కలెక్టర్ మాట్లాడుతూ మహిళల రక్షణ పట్ల అందరికీ అవగాహన ఉండాలన్నారు. క్షేత్రస్థాయిలో అంగన్వాడీలు, సచివాలయాల సిబ్బంది ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా ఎస్పీ గౌతమి శాలి మాట్లాడుతూ మహిళలు మౌనంగా ఉండటం వల్లే వారిపై అఘాయిత్యాలు పెరుగుతున్నాయన్నారు. కుటుంబాల పరువు పేరుతో నేరాలు వెల్లడించలేదన్నారు. తల్లిదండ్రులు ఆడపిల్లలకు భావవ్యక్తీకరణ స్వేచ్ఛ ఇవ్వాలని, వారితో స్నేహపూర్వకంగా ఉంటూ మానసిక ధైర్యాన్ని, స్తైర్యాన్ని కల్పించాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ కల్పనా కుమారి మాట్లాడుతూ సమాజంలో మూఢ నమ్మకాలే మహిళలపై హింసకు మరో కారణమన్నారు. లింగ వివక్షను సమూలంగా నిర్మూలించాలన్నారు. అనంతరం గర్భిణులకు సామూహిక సీమంతం, చిన్నపిల్లలకు అన్నప్రాసన నిర్వహించారు. స్త్రీ శిశు సంక్షేమ శాఖ నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో మహిళా కమిషన్ సభ్యురాలు గడ్డం ఉమా, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ సీతామహాలక్ష్మి, కెవిపి మెమోరియల్ ట్రస్టీ కరణం కళావతి, అడ్వకేట్ యశస్విని, ఉమెన్ ఫైనాన్స్ మెంబర్ బాల వరలక్ష్మి, దిశా సిఐ లక్ష్మి, ఐసిడిఎస్ ప్రాజెక్టు అధికారులు, అంగన్వాడీ సిబ్బంది, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు.










