మహిళలను కించపరుస్తూ మాట్లాడిన గరికపాటి బహిరంగ క్షమాపణ చెప్పాలి
ఐద్వా నాయకులు పద్మావతి, లక్ష్మి
ప్రజాశక్తి-విఆర్.పురం
మహిళలను కించపరుస్తూ మాట్లాడిన ప్రవచనకారుడు గరికపాటి నరసింహారావు వెంటనే మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) జిల్లా నాయకులు ఐ.పద్మావతి, విఆర్.పురం మండల అధ్యక్షులు, ఎంపిపి కారం లక్ష్మి డిమాండ్ చేశారు. ఐద్వా విఆర్.పురం మండల కమిటీ సమావేశం రేఖపల్లి సిపిఎం కార్యాలయంలోని మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాజంలో లక్షలాది మంది ప్రజానీకాన్ని ప్రభావితం చేస్తున్న గరికపాటి నరసింహారావు ఇటీవల కాలంలో పదేపదే ఆడవాళ్ళ అవయవాలు, ఆధునిక దుస్తులను అసభ్యకరంగా వర్ణిస్తూ చేసిన వ్యాఖ్యలను తీవ్ర ఖండించారు. గరికపాటి నరసింహారావు వ్యాఖ్యల్లో మనుధర్మ శాస్త్రం కనిపిస్తుందని, మహిళల అభివృద్ధికి ఆటంకం కలిగించే విధంగా ఉందని పేర్కొన్నారు. ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి మాయావతిని, ఆమె యొక్క శరీరాన్ని ఏనుగుతో పోలుస్తూ మహిళ అని చూడకుండా అవహేళన చేయడం చట్టరీత్య నేరమని తెలిపారు. గరికపాటి చేసిన వ్యాఖ్యలు అఘాయిత్యాలకు పాల్పడుతున్న నిందితులను సమర్థిస్తున్నట్లు ఉన్నాయన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ఎవరు చేసినా చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. తక్షణమే ఆయన తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకొని మహిళలకు బహిరంగ క్షమాపణ చెప్పాలన్నారు. మహిళా కమిషన్ జోక్యం చేసుకొని విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో మహిళా సంఘాలుగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో మండల కార్యదర్శి సున్నం పార్వతీ, కట్టా లక్ష్మి, వెట్టి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.










