Aug 11,2023 21:30

మహిళల్లో ఆత్మస్థైర్యం పెంచడమే లక్ష్యం

రాయచోటి : స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆత్మస్థైర్యాన్ని పెంచడమే ప్రభుత్వ లక్ష్యంమని, వారికి ఆర్థిక భరోసాను నింపేందుకే 'వైఎస్‌ఆర్‌ సున్నా వడ్డీ' పథకాన్ని అమలు చేస్తోందని కలెక్టర్‌ గిరీష, ప్రభుత్వ విప్‌ గడికోట శ్రీకాంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లోని విసి హాల్లో జిల్లాలోని పట్టణ, గ్రామీణ పరిధిలో 28,545 సంఘాలకు మంజూరైన రూ.41.75 కోట్లను లబ్దిదారులకు మెగా చెక్కు రూపంలో అందించారు. ఈ సందర్బంగా కలెక్టర్‌ గిరీష మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్ధిక ప్రగతి కోసం సున్నా వడ్డీ లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం వారికి అండగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి తన సుధీర్ఘ పాదయాత్రలో చేసిన హామీలన్నీ నెరవేరుతున్నాయన్నారు. మహిళ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని తద్వారా గ్రామం, రాష్ట్రం, సమాజం బాగుంటుందని నమ్మి ముఖ్యమంత్రి ఆలోచన చేసి 90 శాతం పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారన్నారు. గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ పెద్ద, పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుందన్నారు. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. శ్రీకాంత్‌రెడ్డి మాట్లాడుతూ ఇచ్చిన మాట ప్రకారం మహిళలకు ఆర్ధికంగా అండగా నిలిచేందుకు ప్రభుత్వం వైయస్‌ఆర్‌ సున్నా వడ్డీ పథకంను ప్రవేశపెట్టిందనన్నారు. మహిళల సంక్షేమ విషయంలో ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందన్నారు. పొదుపు సంఘాల విషయంలో ముఖ్యమంత్రి ఎంతో మేలు చేయాలని సద్దుదేశంతో చెప్పిన మాట ప్రకారం ఇప్పటికీ మూడు విడతలు రుణమాఫీ చేశారన్నారు. గత ప్రభుత్వ పాలనలో ఎప్పుడు కూడా సున్న వడ్డీ జమ కాలేదున్నారు. రాయచోటి నియోజకవర్గంలో రూ.ఏడు కోట్లు, రాయచోటి మున్సిపాలిటీలో రూ.1.20 కోట్లు, ఇప్పటి వరకు దాదాపు నాలుగు విడతలు రాయచోటి నియోజవర్గంలోనే రూ.30 కోట్ల పైగా అందజేసినట్లు తెలిపారు. దాదాపు 5 వేల గ్రూపులకు డబ్బులు జమైందన్నారు. మహిళలందరూ కూడా ఆర్థికంగా ఎదగాలన్నారు. మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాష మాట్లాడుతూ పొదుపు సంఘాల మహిళలు పడుతున్న కష్టాలను తన పాదయాత్రలో కళ్లారా చూసిన ముఖ్యమంత్రి సున్నావడ్డీకే రుణాలు ఇస్తానని హామీ ఇచ్చారని, ఆ హామీని తూచా తప్పక అమలు చేసి నాలుగోవ ఏడాది కూడా నిరంతరాయంగా లబ్ది మొత్తాన్ని అందించి మాట తప్పని నేతగా కీర్తిగడిస్తూన్నారన్నారు. కార్యక్రమంలో జెసి ఫర్మాన్‌ అహ్మద్‌ ఖాన్‌, డిఆర్‌డిఎ పీడీ సత్యనారాయణ, ఎల్‌డిఎం వెంకటేశ్వరరెడ్డి, డిఆర్‌డిఎ, మెప్మా సిబ్బంది, గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా చెక్‌ను అందజేస్తున్న కలెక్టర్‌, ఎమ్మెల్యే