ప్రజాశక్తి - ఏలూరు
దేశంలో పేరులు మార్చటం కాదని, మహిళలకు రక్షణ కల్పించాలని ఐద్వా డిమాండ్ చేసింది. శుక్రవారం మధ్యాహ్నం ఏలూరు సెయింట్ థెరిస్సా డిగ్రీ కళాశాలలో 'దేశంలో ప్రజాస్వామ్యం - మహిళలు, చిన్నారులకు రక్షణ' అనే అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సుకు ఐద్వా జిల్లా కన్వీనర్ పి.హైమావతి అధ్యక్షత వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న సీనియర్ జర్నలిస్టు డాక్టర్ పి.సురేష్ కుమార్ మాట్లాడుతూ దేశంలో ప్రస్తుతం బిజెపి ప్రభుత్వం పేర్లు మార్చే పనిలో ఉందని, కానీ ప్రజల బ్రతుకులు మాత్రం మార్చటం లేదని విమర్శించారు. ముఖ్యంగా ప్రపంచంలో అతి గొప్ప ప్రజాస్వామ్య దేశమైన మన భారతదేశంలో మహిళలు చిన్నారులకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. బిజెపి పెంచి పోషిస్తున్న మతోన్మాద ఘర్షణలో సైతం ఆడవాళ్లనే ఉపయోగించుకుంటున్నారన్నారు. దానికి నిదర్శనం మణిపూర్‌లో మహిళలని నగంగా ఊరేగించి, అత్యాచారాలు చేయడం అన్నారు. స్వయంగా మణిపూర్‌లో ఇటీవల పర్యటించి వచ్చానని ఆయన అనేక వివరాలు తెలిపారు. ఐద్వా నాయకులు జె.హరీషాదుర్గ మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చిన తర్వాత మహిళలపై అత్యాచారాలు మరింత పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా 'ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి మహిళలు చిన్నారులపై అత్యాచారాలు అరికట్టాలని' రాసిన బ్యానర్‌పై సంతకాలు సేకరించారు. ఈ సంతకాల కార్యక్రమంలో విద్యార్థినిలు, లెక్చరర్లు అంతా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో సెయింట్ థెరిస్సా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ సిస్టర్ పి.మెర్సి, సిస్టర్ మెరిసి క్రిస్టీ, సిస్టర్ పద్మావతి, ఐద్వా ఏలూరు నగర ఉపాధ్యక్షులు సిహెచ్ రాజ్యలక్ష్మి పాల్గొన్నారు.










