Jul 29,2023 21:40

పార్వతీపురం : జాతాలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి

ప్రజాశక్తి-పాలకొండ/పాలకొండ రూరల్‌ : దేశంలోని, రాష్ట్రంలో రోజురోజుకు మహిళలపై హింస విపరీతంగా పెరిగిపోతుందని, దీనిపై మహిళలకు ప్రభుత్వాలు రక్షణ కల్పించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. శనివారం హింసపై మహిళా పోరుయాత్ర జాతా పాలకొండకు చేరింది. స్థానిక ఆర్‌టిసి కాంప్లెక్స్‌ సమీపంలో కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ దేశంలో మహిళలకు రక్షణ కరువవుతుందని, బిజెపి పాలనలో మహిళలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని అన్నారు. హింసను రెచ్చగొడుతున్న బిజెపిని గద్దె దించాలన్నారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. నిందితులను ఫాస్ట్‌ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారించి కఠిన శిక్షలు విధించాలన్నారు. కళాళాలల దగ్గర, మహిళలు పనిచేస్తున్న ప్రదేశాలల్లో వేధింపులు నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. మద్యం, మత్తు పదార్థాలను నియంత్రించేలా చర్యలు చేపట్టాలన్నారు. మహిళలపై జరుగుతున్న సంఘటనలపై ప్రభుత్వాలు దృష్టిపెట్టి పునరావృతం కాకుండా చూడాలన్నారు. కార్యక్రమంలో ఐద్వా జిల్లా ఉపాధ్యక్షులు ఎన్‌.హిమప్రభ, శారద, గౌరీశ్వరి, శ్రీదేవి, జెస్సీబాయి తదితరులున్నారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న హింసాకాండపై నాటకాలు ద్వారా ప్రదర్శించి పలువురిని ఆకట్టుకున్నారు.
పార్వతీపురంరూరల్‌ : ఐద్వా ఆధ్వర్యాన జరుగుతున్న మహిళా పోరుయాత్ర జాతా శనివారం సాయంత్రం చేరుకుంది. ఈ జాతాకు పట్టణ ఐద్వా నాయకులు బొగ్గులవీధి జంక్షన్‌ వద్ద స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి మాట్లాడుతూ దేశవ్యాప్తంగా మహిళలపై దాడులు, లైంగిక వేధింపులకు నిరసనగా ఈ జాతాను చేపట్టామన్నారు. మహిళలపై జరుగుతున్న దాడులను ఖండిస్తూ ఆగస్టు 9న విజయవాడలో జరుగు బహిరంగ సభకు పెద్దఎత్తు మహిళలు విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఐద్వా జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీదేవి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు రమణి, అభ్యుదయ కవి పక్కి ఉమాశంకర్‌, యుటిఎఫ్‌ ఎస్‌ఎఫ్‌ఐ, పట్టణ పౌరసంక్షేమ సంఘం, సిఐటియు, ఆర్‌పిల సంఘం పట్టణ సంఘ నాయకులు గెద్ద తులసి, బెలగాం రమణమ్మ, మంగమ్మ, గౌరమ్మ పాల్గొన్నారు.