ఐలు ఆధ్వర్యాన న్యాయవాదుల ఆందోళన
ప్రజాశక్తి - ఏలూరు అర్బన్
ప్రవచనాలు చెప్పుకునే గరికపాటి నరసింహారావు మహిళలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ.. ఆయన వాటిని వెంటనే ఉపసంహరించుకుని మహిళలకు క్షమాపణ చెప్పాలని ఆలిండియా లాయర్స్ యూనియన్ (ఐలు) ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా కోర్టులో న్యాయవాదులు బుధవారం ఆందోళన చేపట్టారు. బార్ అసోసియేషన్ వద్ద చేపట్టిన నిరసననుద్దేశించి ఐలు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షురాలు, రాష్ట్ర మహిళా కన్వీనర్ ఓరుగంటి శైలజ మాట్లాడుతూ మహిళల ప్రవర్తన, దుస్తులు కారణంగానే హత్యాచారాలు జరుగుతున్నాయనడం సరికాదన్నారు. మహిళలను కించపరిచేలా గరికపాటి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకుని క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. తేజశ్రీ దేవి మాట్లాడగా కార్యక్రమంలో పి.విజయకుమారి, ఆర్.వాణి, కృష్ణవేణి, గంగ, దాసరి విజయ, గెద్ద విజయభాస్కర్, కట్టా సత్యనారాయణ, పుచ్చల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.










