మహిళలే మహారాణులు
- నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
- పోరాటం నుంచే మహిళా దినోత్సవం
ప్రజాశక్తి-కర్నూలు ప్రతినిధి/నంద్యాల కలెక్టరేట్
మహిళలు అన్నింటా పురుషులతో పాటు సమానంగా పోటీ పడుతున్నారు. అన్ని రంగాల్లో రాణిస్తూ మహారాణులుగా నిలుస్తున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని మార్చి 8న జరుపుకుంటారు. మహిళల విజయాలు సెలబ్రేట్ చేసుకోవడానికి ఈ రోజును ప్రత్యేకంగా జరుపుకుంటారు. మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనం..
అమెరికాలోని న్యూయార్క్ నగరంలో 1909 ఫిబ్రవరి 28న అమెరికన్ సోషలిస్ట్ పార్టీ జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంది. కార్మిక కార్యకర్త థెరిసా మల్కెయిల్ ఈ రోజును ప్రతిపాదించారు. నగరంలోని రెడీమేడ్ గార్మెంట్స్ కార్మికులపై జరుగుతున్న అణచివేతను ఖండిస్తూ దినోత్సవాన్ని ప్రారంభించారు. దీని ప్రాముఖ్యతను చూసి ముగ్ధులయిన అమెరికన్ సోషలిస్ట్ నాయకులు మహిళా దినోత్సవాన్ని జరుపుకోవాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు. అయితే, ఆ సమయంలో నిర్దిష్ట తేదీని నిర్వచించలేదు. ఈ నేపథ్యంలో 1975, 1977లో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ఐరాస నిర్వహించింది. ఆ సంస్థ సంబరాలు ప్రారంభించింది. తదనంతరం, ఐక్యరాజ్యసమితి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించింది. మహాసభ ప్రకటించింది. ఈ రోజున మహిళల హక్కులను కాపాడేందుకు , ప్రపంచవ్యాప్తంగా మహిళలు శాంతియుతంగా జీవించేందుకు చర్యలు తీసుకోవడానికి కట్టుబడి ఉంది. దీని తర్వాత ప్రతి సంవత్సరం మహిళా దినోత్సవం సందర్భంగా కొత్త థీమ్‌ను ప్రవేశపెడుతున్నారు. మహిళలు సాధించిన విజయాల గురించి మాట్లాడడమే కాకుండా, లింగ ఆధారిత భేదాలు, సమానత్వం లక్ష్యం, మహిళల హక్కులు మొదలైన వాటి గురించి కూడా ఈ రోజున అవగాహన కల్పిస్తారు. మహిళా సంక్షేమంపై దష్టి సారించిన వివిధ మహిళా సంఘాలు ఈ రోజున నిధులు సమకూరుస్తున్నాయి.
ఆమెదే ఆధిక్యం
- 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్లే ఎక్కువ
ఉమ్మడి జిల్లాలోని ఓటర్లలోనూ ఆమెదే ఆధిక్యం. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33.44 లక్షల మంది ఓటర్లు ఉండగా 14 నియోజకవర్గాల్లో 10 నియోజకవర్గాల్లో మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. ఆళ్లగడ్డ, నందికొట్కూరు, కర్నూలు, పాణ్యం, నంద్యాల, బనగానపల్లె, డోన్, పత్తికొండ, ఎమ్మిగనూరు, మంత్రాలయం నియోజకవర్గాల్లో పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్లే ఎక్కువగా ఉన్నారు. జిల్లా వ్యాప్తంగా కూడా మహిళా ఓటర్ల సంఖ్యనే ఎక్కువగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 33,44,950 మంది ఓటర్లు ఉండగా అందులో 16,57,114 మంది పురుషులు, 16,87,244 మంది మహిళలు, 592 మంది స్త్రీలు ఉన్నారు. 49.54 శాతం మంది పురుష ఓటర్లు ఉండగా 50.44 శాతం మంది మహిళా ఓటర్లు ఉన్నారు. ఇతర ఓటర్లలో అత్యధికంగా నంద్యాలలో 104 మంది ఉన్నారు. అత్యధికంగా పాణ్యం నియోజకవర్గంలో 3,09,204 మంది ఓటర్లు ఉండగా శ్రీశైలం నియోజకవర్గంలో 1,92,380 మంది ఓటర్లు ఉన్నారు.
పట్టభద్రుల్లో 56.54 శాతం మహిళా ఓటర్లు
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల ప్రక్రియ సాగుతోంది. ఇప్పటికే పోటీలో నిలిచే అభ్యర్థుల జాబితా ఖరారు కావడంతో అభ్యర్థులు ప్రచారం మునిగిపోయారు. పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ నియోజకవర్గానికి సంబంధించి ఉమ్మడి కర్నూలు జిల్లాలో 1,178 మంది ఓటర్లు ఉన్నారు. వారిలో మహిళలే అధికంగా ఉన్నారు. ఉమ్మడి జిల్లాలోని పట్టభద్ర ఓటర్లలో 512 మంది పురుషులు, 666 మంది మహిళలు ఉన్నారు. అన్ని రెవెన్యూ డివిజన్లలోనూ పురుష ఓటర్ల కంటే మహిళా ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉంది. మొత్తం ఓటర్లలో అత్యధికంగా ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌లో 268 మంది ఓటర్లు ఉండగా అత్యల్పంగా పత్తికొండ రెవెన్యూ డివిజన్‌లో 144 మంది ఓటర్లు ఉన్నారు.
ఆవని నుండి అంతరిక్షం వరకు
ఆవని నుండి అంతరిక్షం వరకు ఎదుగుతూ అన్ని రంగాల్లో మహిళలు రాణిస్తున్నారు. సమాన అవకాశాలు కల్పిస్తే సమాజాభివృద్ధిలోను, సాధికారతలోనూ ముందుంటారు. అక్షరాస్యతలోనూ మహిళలు ముందుండాలి. మహిళల రక్షణకు ప్రభుత్వాలు అనేక రకాల చట్టాలను అమలు చేస్తున్నాయి. అవసరమైనప్పుడు ఆ చట్టాలను ఉపయోగించుకోవాలి. చదువుతోపాటు ఉద్యోగం ఉపాధి వంటి అవకాశాల్లో మహిళలను ప్రోత్సహించాలి. మహిళలు ఆత్మవిశ్వాసం ఆత్మస్థైర్యం కలిగి ఉండి సమస్యలు, ఓడిదొడుకులు వచ్చినప్పుడు ధైర్యంగా ఎదుర్కోవాలి. సమాజం మహిళల పట్ల వివక్ష చూపకుండా మగవారితో సమానం అనే అవగాహనతో ముందుకు సాగాలి. ప్రోత్సహించాలి.
జిల్లా జాయింట్ కలెక్టర్ టి.నిశాంతి.
పురుషులతో సమానంగా అంతరిక్షంలోకి మహిళలు
ఒకప్పుడు మహిళలను వంటింటి కుందేలులా చూసేవారు. కానీ పరిస్థితి మారింది. పురుషులతో సమానంగా శాటిలైట్ ద్వారా ఉపగ్రహాల్లోకి రోదసి యాత్రల్లోకి మహిళలు పయనిస్తున్నారు. మహిళా సాధికారత వచ్చింది. ఆర్ధికంగా అభివృద్ధి చెందుతున్నారు. ప్రతి చోట పురుషులతో సమానంగా మహిళలు విజయం సాధిస్తున్నారు.
అనురాధ, నంద్యాల జిల్లా విద్యాధికారి.
మహిళలకు సమాన అవకాశాలు కల్పించాలి
అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటున్నా నేటికీ మహిళలకు హక్కులు కల్పించడంలో ప్రభుత్వాలు ఇంకా వెనుకబడి ఉన్నాయి. పని ప్రదేశాలలో యజమానుల వలన మహిళా కార్మికులపై వేధింపులు, అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి. అసంఘటిత మహిళా కార్మికులకు తక్కువ వేతనాలు ఇచ్చి శ్రమ దోపిడీ చేస్తున్నారు. ప్రభుత్వం మద్యం అమ్మకాలను ప్రోత్సహించడం వలన తాగి వచ్చి భార్యలపై దాడులకు పాల్పడుతూ కుటుంబాలను చిన్నాభిన్నం చేసుకుంటున్నారు. కాలేజీలలో ర్యాగింగ్‌ను, విద్యార్థినిల పట్ల దాడులను అరికట్టాల్సిన ప్రభుత్వాలు చట్టాలకే పరిమితమవుతున్నాయి తప్ప వాటిని కఠినంగా అమలు చేయడంలో చిత్తశుద్ధి ప్రదర్శించడం లేదు.. పేరుకే మహిళా సాధికారత అంటున్నారు కానీ నిజమైన మహిళ ఆర్థిక స్వాలంభన సాధించే దిశగా ప్రభుత్వాలు, పాలకులు కషి చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.
టి.నిర్మల, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు.










