Oct 28,2023 01:00

ఓటర్ల ముసాయిదా జాబితాతో గుంటూరు జిల్లా కలెక్టర్‌ తదితరులు

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గుంటూరు, పల్నాడు జిల్లాల్లో ఓటర్ల ముసాయిదా జాబితాలను ఎన్నికల కమిషన్‌ శుక్రవారం ప్రకటించింది. గుంటూరు జిల్లాలో 17,34,797 మంది, పల్నాడు జిల్లాలో 17,01,300 మంది ఓటర్లున్నట్టు నిర్ధారించారు. గతేడాది జులై నుంచి డిసెంబరు వరకు మార్పులు, చేర్పులు అనంతరం 2023 జనవరిలో ప్రకటించిన తుది జాబితాతో పోలిస్తే గత 10 నెలల కాలంలో పెరుగుదల స్వల్పంగా ఉంది. గత జనవరిలో గుంటూరు జిల్లా పరిధిలో 17,11,082 మంది ఉండగా పల్నాడు జిల్లాలో 16,87,820 మంది ఉన్నట్టు అధికారులు గుర్తించారు. గత 10 నెలల కాలంలో గుంటూరు జిల్లాలో 23,715 మంది ఓటర్లు పెరగ్గా, పల్నాడులో 13,480 మంది పెరిగారు.
రెండు జిల్లాల పరిధిలో మరణించిన వారి పేర్లను తొలగించగా కొత్తగా చేరిన వారు అధికంగానే ఉన్నారు. గుంటూరు జిల్లాలో 43 వేలు, పల్నాడులో 40 వేల మంది మృతులు ఉన్నట్టు గుర్తించారు. మొత్తం మహిళలు 51.5 శాతం మంది, పురుషులు 49.3 శాతం మంది ఉన్నారు. రెండు జిల్లాల పరిధిలో మంగళగిరిలో అత్యధికంగా 2,78,452 మంది ఓటర్లు ఉండగా తాడికొండలో అత్యల్పంగా 2,01,485 మంది ఓటర్లున్నారు. కొత్తగా ఓటర్లుగా చేరేవారు ఫారం 6, అభ్యంతరాలు, తొలగింపునకు ఫారం-7, ఒక చోట నుంచి మరొక చోటకి మారాలనుకునే వారు ఫారం-8 సమర్పించాల్సి ఉందని అధికారులు తెలిపారు.
రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో డిసెంబరు 9లోగా మార్పులు, చేర్పులకు అవకాశం ఉండటంతో రాజకీయ పార్టీల వారు జాబితాలపై దృష్టి సారించాయి. ముసాయిదా జాబితాల పరిశీలన అనంతరం తిరిగి అభ్యంతరాల స్వీకరణ, జాబితాల్లో పేర్లు లేని వారు తిరిగి చేరేందుకు అవకాశం కల్పించారు. తమకు తెలియకుండా తమ పేరున ఫారం-7 ప్రత్యర్థులు జారీ చేస్తున్నారన్న విమర్శల నేపథ్యంలో రాజకీయ పార్టీలు అప్రమత్తమయ్యాయి. మరణించిన వారి వివరాలను కూడా పోలింగ్‌ బూత్‌ అధికారులు క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే నిర్ణయం తీసుకోవాలని ఎన్నికల కమిషన్‌ జిల్లా అధికారులకు సూచించింది.
నియోజకవర్గాల వారీగాముసాయిదా ఓటర్ల జాబితాల వివరాలు
నియోజకవర్గం పురుషులు మహిళలు థర్డ్‌జండర్‌ ఇతరులు మొత్తం
తాడికొండ 97,236 103970 7 272 201485
మంగళగిరి 134253 143991 22 186 278452
పొన్నూరు 116275 223995 18 568 223995
తెనాలి 125730 134699 45 451 260925
పత్తిపాడు 124989 133874 30 454 259347
గుంటూరు వెస్టు 131214 137547 54 562 269377
గుంటూరుతూర్పు 118281 124822 38 157 243298
పెదకూరపాడు 110062 114485 23 145 224570
చిలకలూరిపేట 107925 117009 49 224 224983
నరసరావుపేట 111931 116688 38 187 228657
సత్తెనపల్లి 114976 119449 17 280 234442
వినుకొండ 128638 129331 21 210 257990
గురజాల 130782 137185 43 151 268010
మాచర్ల 129609 133115 23 110 262648