Jan 09,2021 07:04

మన దేశంలో స్త్రీ, పురుషుల మధ్య అక్షరాస్యతలో 13 శాతం అంతరం ఉంది. గ్రామీణ మహిళల అక్షరాస్యత 57 శాతం, పురుషుల అక్షరాస్యత 77 శాతం. పైగా నిరక్షరాస్యులైన జనాభాలో 57 శాతం మహిళలే. ఉన్నత విద్యలో మహిళల నమోదు 40.6 శాతం మాత్రమే. పాఠశాల దశలో చేరని వారిలో 70 శాతం బాలికలు. 27 శాతం మంది బాలికలకు 18 ఏళ్లకు ముందే వివాహాలు జరుగుతున్నాయి. ప్రపంచ మహిళలతో పోల్చితే భారత మహిళలు 25 శాతం తక్కువ వేతనం పొందుతున్నారు. ఐఎల్‌ఓ 2017 నివేదిక ప్రకారం కార్మికుల్లో మహిళా భాగస్వామ్యం 27 శాతం ఉంది. తయారీ రంగంలో స్త్రీపురుష వేతన వ్యత్యాసం ఎక్కువ. బ్యాంకింగ్‌, ఐ.టి రంగంలో మహిళలు 1 నుండి 3 సంవత్సరాలు మాత్రమే ఉంటున్నారు. పదేళ్ల కన్నా ఎక్కువ ఉన్న వారు కేవలం 2.7 శాతం. ఇంజనీరింగ్‌, మెడిసిన్‌ విభాగాలలో కొంత మెరుగైనా ఐఐటి, పరిశోధన మరియు అభివృద్ధిలో నామమాత్రమే. లింగ ఆధారిత పక్షపాతం దేశ అభివృద్ధి, పురోగతిపై ప్రభావం చూపుతుంది. సమాజ పురోగతిని మహిళలు సాధించిన పురోగతి ద్వారా కొలవాలని డా||బి.ఆర్‌.అంబేద్కర్‌ అన్నారు. సామాజిక వివక్షతోపాటు పాఠశాలల మౌలిక సదుపాయాలు, ఆర్థిక వెనుకబాటుతనం, రుతు సమస్యలు, సంప్రదాయాలు, ఆచారాలు మహిళల విద్యను ఆటంకపరుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్రం తీసుకొచ్చిన నూతన జాతీయ విద్యా విధానం (ఎన్‌ఇపి) పరిస్థితిని మెరుగుపర్చకపోగా మరింత దిగజారుస్తున్నది.
జాతీయ విద్యా విధానం మహిళల గుర్తింపునే నిరాకరించింది. మహిళగా కాక...సాంఘిక, ఆర్థిక, వెనుకబడిన తరగతులలో ఒక తరగతిగా గుర్తించింది. ఎన్‌ఇపి నివేదిక పొడుగునా భారతీయ విలువలు, గొప్ప విభిన్న సాంప్రదాయాలు, శాశ్వతమైన భారతీయ జ్ఞానం వంటి ప్రస్తావన ఉంది. ప్రాచీన భారతీయ విద్యా వ్యవస్థ, సంప్రదాయాలు మహిళలకు, కింది కులాలకు విద్యను నిరాకరించాయి కదా. ఎన్‌ఇపి కూడా దీనినే బలపరుస్తున్నది. ప్రాచీన విద్యా వ్యవస్థ తయారు చేసిన చాలా మంది పండితుల గురించి ప్రస్తావించిన ఎన్‌ఇపి చార్వాకులు, గౌతముని ప్రస్తావించలేదు. అంటే హేతువాదం, ప్రశ్నించే తత్వాలను లేకుండా చేయడమే ఎన్‌ఇపి లక్ష్యం. ఎన్‌ఇపి లో ప్రస్తావించిన వారంతా ఆరవ శతాబ్దానికి చెందిన వారే. తర్వాత 21వ శతాబ్దం గురించి మాత్రమే ప్రస్తావిస్తుంది. అంటే ఆ మధ్యలో థాట్‌ అండ్‌ ఇంటరాక్షన్‌ లేవా? ఆధునిక కాలంలో కుల వ్యతిరేక భక్తి ఉద్యమాల గురించి గానీ, 19వ శతాబ్దపు సంస్కరణ ఉద్యమాల ప్రస్తావనే లేదు. మరీ ముఖ్యంగా సావిత్రీబాయి పూలే, జ్యోతిరావు పూలే, అంబేద్కర్‌ గురించి లేదు. ఎన్‌ఇపి వేదాలను, ఉపనిషత్తులను ప్రస్తావించిందే కాని బౌద్ధ మతం, చార్వాకులను పట్టించుకోలేదు. కాలం చెల్లిన, ఆచారిత్రికమైన, పౌరాణిక (మైథిలాజికల్‌) విలువలతో 21వ శతాబ్దం లోకి వెళ్లాలని చెబుతున్నది. ఇది మహిళలను అణగదొక్కి, వర్ణ వ్యవస్థను పునరుద్ధరించడమే.
భారత రాజ్యాంగం స్త్రీ, పురుషులకు సమాన హక్కులు, అవకాశాలు ఇచ్చింది. కానీ ఎన్‌ఇపి ప్రాథమిక బాధ్యతల గురించి చెప్పింది తప్ప, ప్రాథమిక హక్కుల గురించి చెప్పలేదు. ఎన్‌ఇపి రాజ్యాంగ లక్ష్యాలను రాజ్యాంగ విలువలుగా దిగజార్చింది. సేవ, అహింస, నిష్కామ కర్మ, పరోపకారం, పెద్దల పట్ల గౌరవం వంటి 29 విలువలను ప్రస్తావించి, వాటిలో రాజ్యాంగ లక్ష్యాలను కూడా చేర్చారు. వ్యవస్థకు అణిగిమణిగి ఉండే చైతన్యాన్ని పెంచడమే దీని లక్ష్యం. నిజానికి ఇవి రాజ్యాంగం విలువలు కాదు. ఆర్‌ఎస్‌ఎస్‌ నడిపే 'విశ్వభారతి స్కూల్‌' ఫోల్డర్‌ లోనివి కదా!
ఎన్‌ఇపి నిష్కామ కర్మను ఒక గొప్ప విలువగా చెప్పింది. ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని పాటించడమే కదా! విద్య... విమర్శనాత్మక ఆలోచన మరియు సమస్య పరిష్కారం కోసమని గాక... సామాజిక, నైతిక, భావోద్వేగ సామార్ధ్యాలు, వైఖరులను పెంపొందించేదిగా మారుస్తున్నది. ఇవి పాఠ్యాంశాల్లో భాగంగా ఉండవచ్చా? ఉంటే రాజ్యం ప్రతిపాదించిన, విధానాలు నిర్దేశించిన నైతిక సూత్రాల పర్యావసానాలు ఎలా ఉంటాయి? ఇది నిరంకుశ, ఏకశిల, మెజార్టీ నిర్మాణాలకు దారితీయదా? ఇది మహిళల హక్కులను హరిస్తుంది.
ఎన్‌ఇపి ప్రతిపాదించిన వృత్తి విద్య వివిధ తరగతుల్లో బాలికలు, కింద వర్ణాల విద్యార్థులు డ్రాపౌట్‌ కావడాన్ని చట్టబద్ధం చేస్తుంది. ఇంకా ప్రమాదకరమైన విషయమేమిటంటే ఇది శ్రమ గౌరవాన్ని పూర్వపక్షం చేసి, దాని స్థానంలో కులవృత్తులను కూర్చోబెడుతుంది. జ్ఞానం ఉన్నత వర్గాలకు, నైపుణ్యం అణగారి వర్గాలకు, నియత విద్య ఉన్నత వర్గాలకు, అనియత విద్య అణగారిన వర్గాలకు పరిమితమవుతుంది. వివక్షకు గురయ్యే తరగతుల హక్కులను హరిస్తుంది. ఇది వర్ణాశ్రమ ధర్మాన్ని, కులాల అంతరాలను స్థిరీకరిస్తుంది. ఆర్‌ఎస్‌ఎస్‌ ప్రవచిత సిద్ధాంతమిది. లింగ వ్యత్యాసాన్ని తగ్గిస్తామని ఎన్‌ఇపి చెప్తోంది. 2030 నాటికి పాఠశాల విద్యలో వంద శాతం ఆడపిల్లలను నమోదు చేయాలని చెబుతూ అందుకు నియత, అనియత విద్యలను సిఫారసు చేసింది. అంటే భౌతికంగా బడికి వెళ్లలేని వారి కోసం ఓపెన్‌ స్కూళ్లు, దూరవిద్యలను కొనసాగించాలని చెప్పింది. పేద వర్గాలు, పని చేయకపోతే గడవని దళిత, బహుజన, ఆదివాసీ ఆడపిల్లలే కదా భౌతికంగా బడికి వెళ్లలేనివాళ్లు.
భారతదేశంలో మహిళా వివక్ష, కుల వివక్ష ఇంకా కొనసాగుతున్నాయి. ఇవి మరింత తీవ్రంగా కొనసాగాలనే దురుద్దేశ్యం ఆర్‌ఎస్‌ఎస్‌ ది. ఆ సంస్థ అరకొర జ్ఞానం, సంకుచిత సూత్రాలు, వారసత్వం లోని చిన్నపాటి ముక్కను తీసుకొని రూపొందించిన ఈ విద్యా విధానం మహిళలను, పేదలను వివక్షకు గురిచేసి విద్యను ప్రైవేట్‌ మార్కెట్‌కు అప్పగిస్తుంది.
విద్యలో మహిళలు ఎదుర్కొంటున్న సామాజిక సమస్యలు, మౌలిక వసతులు, రవాణా, ఆర్థిక సహాయం, నిధులు వంటి విషయాలపై ఎన్‌ఇపి మాట్లాడలేదు. కుమార్తెల విద్య కన్నా కుమారుల విద్యకు ప్రాధాన్యత ఇవ్వడం, తోబుట్టువుల సంరక్షణ బాధ్యత, ముందస్తు వివాహాలు, చదువు ఖర్చు మొదలైన సమస్యలపై ఎటువంటి ప్రతిపాదనలు చేయలేదు.
బాలికల రుతు పరిశుభ్రత, నిర్వహణ వంటి ప్రత్యేక అవసరాలను గుర్తించలేదు. నీరు, పారిశుధ్యం, పరిశుభ్రత కార్యక్రమంలో భాగంగానే దీన్ని చూసింది. శానిటరీ ప్యాడ్ల సరఫరా, విశ్రాంతికి ప్రైవేట్‌ స్థలం, రుతుస్రావం గురించిన సమాచారం, పరిశుభ్రత, బోధనేతర సిబ్బంది, మొదలైన వాటిపై ఎటువంటి ప్రతిపాదన లేదు.
లైంగిక హింస తగ్గడానికి పాఠ్యాంశాల రూపకల్పనలో బాలురు, బాలికలు సమానమన్న భావం కలగడానికి సమగ్ర యుక్త వయస్సు విద్యా కార్యక్రమం ఇందులో ఏదీ లేదు. జస్టిస్‌ వర్మ పాఠ్యాంశాలలో బాలికల జ్ఞానం, సామర్ధ్యం పెరిగే అంశాలను పెట్టాలన్న సిఫార్సులను పట్టించుకోలేదు.
ఎన్‌ఇపి ప్రతిపాదించిన స్కూల్‌ కాంప్లెక్స్‌ వల్ల పిల్లలకు పాఠశాల అందుబాటు తగ్గి, డ్రాపౌట్‌ పెరిగే అవకాశం ఉంది. ఉపాధ్యాయ నియామక అర్హతలు, నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బిఇడి టీచింగ్‌ యూనివర్శిటీల్లోనే చేయాలన్న నిబంధన...మహిళలు, కింది కులాల నుండి ఉపాధ్యాయులు అయ్యే అవకాశం దెబ్బతీస్తుంది.
ఎన్‌ఇపిలో 50 సార్లు ఆన్‌లైన్‌ అనే పదాన్ని, 30 సార్లు డిజిటల్‌ విద్య అనే పదాన్ని ప్రస్తావించింది. 40 శాతం పాఠశాలలకు విద్యుత్‌, 73 శాతం ఇంటర్‌నెట్‌ సదుపాయం లేని పరిస్థితుల్లో బాలికల డ్రాపౌట్‌కు ఇది దోహదం చేస్తుంది.
బాలికల విద్య...సామాజిక న్యాయం కోసం మాత్రమే కాదు. సామాజిక పరివర్తనకు అవసరమని కొఠారీ విద్యా విధానం (1968) చెప్పింది. ఈ మేరకు మహిళలలో కొంతమేరకు అక్షరాస్యత పెరిగింది. 1986 నూతన విద్యా విధానం మహిళల సమగ్ర అభివృద్ధికి ప్రధానంగా ప్రాథమిక విద్య అందుబాటు, వయోజన విద్యను ప్రతిపాదించింది. 2020 జాతీయ విద్యా విధానం లింగ వ్యత్యాసాన్ని తగ్గించడానికి లింగ చేరిక నిధిని ఏర్పాటు చేసి మహిళలను వృత్తి, సాంకేతిక విద్యలకు పరిమితం చేస్తున్నది. మహిళల గుర్తింపును సాంఘిక ఆర్థిక వెనుకబడిన తరగతుల గుర్తింపుగా మార్చివేసింది. మొత్తంమీద మహిళల విద్యకు ఎన్‌ఇపి పెనుముప్పుగా పరిణమిస్తుందనడంలో సందేహం లేదు.
                                                         మహిళల విద్యకు ఎన్‌ఇపి పెనుముప్పు             (వ్యాసకర్త యుటిఎఫ్‌ రాష్ట్ర కార్యదర్శి,
                                                                                                             సెల్‌ : 94412 16332)