Jul 29,2023 22:56

మాట్లాడుతున్న ప్రభావతి

- నిపుణులతో కమిషన్‌ ఏర్పాటు చేయాలి
- ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి
- జిల్లాకు చేరుకున్న పోరు యాత్ర రాష్ట్ర జాతా
- జాతాలో ఆకట్టుకున్న కళాకారుల ప్రదర్శనలు
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: 
మహిళలపై దాడులు, హింసను అరికట్టడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. హింసపై మహిళల పోరు యాత్ర రాష్ట్ర జాతా శ్రీకాకుళం నగరంలోని ఏడు రోడ్ల కూడలి వద్ద శనివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆమె మాట్లాడారు. దేశంలో చిన్నారులు, మహిళలపై హింస రోజురోజుకూ పెరుగుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో పాలకులు విఫలమయ్యారని చెప్పారు. మణిపూర్‌లో ముగ్గురు మహిళలను నగంగా ఊరేగించి అత్యాచారం చేయడం దారుణమన్నారు. భారత మాతాకు జై అంటూ దేశభక్తి ప్రదర్శిస్తున్న బిజెపి ప్రభుత్వం మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ఎందుకు ఆపడం లేదని విమర్శించారు. మణిపూర్‌లో మారణకాండకు మోడీదే ప్రధాన బాధ్యత అని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న మతతత్వ, ఫాసిస్టు విధానాల వల్లే ఇటువంటి దారుణ ఘటనలు చోటుచేసుకుంటున్నాయని చెప్పారు. మణిపూర్‌లో మహిళలపై అత్యాచారానికి పాల్పడిన దోషులను కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేశారు. దేశంలో మహిళలపై 55 శాతం దాడులు పెరిగాయని క్రైమ్‌ బ్యూరో రికార్డులు వెల్లడిస్తున్నాయన్నారు. మద్యం, గంజాయి వంటి మత్తు పదార్థాల వల్లే ఇన్ని అనర్థాలు చోటుచేసుకుంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. అదానీ పోర్టులో రూ.మూడు వేల కోట్ల గంజాయి పట్టుబడడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. ఎన్నికల ముందు మద్యపానాన్ని నిషేధిస్తామని చెప్పిన జగన్మోహన్‌రెడ్డి, అధికారంలోకొచ్చాక ఆదాయం పెంచుకునే పనిలో పడ్డారని విమర్శించారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అధ్యయనం చేయడానికి నిపుణులతో కమిటీ వేయాలన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై నేరాలకు పాల్పడే నిందితులకు ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ చేసి కఠిన శిక్షలు విధించాలన్నారు. హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చలనచిత్రాలు, టీవీ సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలని డిమాండ్‌ చేశారు. మహిళలకు రక్షణ కల్పించలేని బిజెపిని గద్దె దించాలని పిలుపునిచ్చారు. మహిళలపై హింస, దాడులను అరికట్టాలని డిమాండ్‌ చేస్తూ పోరుయాత్ర ముగింపు సందర్భంగా ఆగస్టు ఎనిమిదో తేదీన విజయవాడ జింఖానా గ్రౌండ్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు అధిక సంఖ్యలో మహిళలు తరలిరావాలని కోరారు.
ఐద్వా రాష్ట్ర సహాయ కార్యదర్శులు వై.సత్యవతి, పి.పూర్ణ మాట్లాడుతూ మహిళలపై దాడులకు పాల్పడుతున్న వారికి శిక్షలు లేకపోవడం వల్లే హింస పెచ్చుమీరుతుందన్నారు. మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. సభాధ్యక్షులు, ఐద్వా జిల్లా కన్వీనర్‌ ఎ.లక్ష్మి మాట్లాడుతూ గ్రామాల్లో మద్యం ఏరులై పారుతోందన్నారు. నగర కన్వీనర్‌ శ్రీదేవి మాట్లాడుతూ మణిపూర్‌లో మహిళలపై దాడులు, అకృత్యాలకు బిజెపి ప్రభుత్వమే కారణమన్నారు.
జాతాలో భాగంగా ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన నాటిక, నృత్యాలు అందరినీ ఆకట్టుకున్నాయి. ఎక్కడ వచ్చింది స్త్రీ జాతికి స్వాతంత్య్రం అంటూ కళాకారుల నృత్యం అందరినీ అలరించింది. మద్యపానంతో జరిగే అనర్థాలపై 'మందుబాబులం మేం' అంటూ ప్రదర్శించిన నాటిక అందరినీ నవ్వులు పూయించింది. సిఐటియు శ్రీకాకుళం జాతాకు రూ.2 వేలు ఆర్థికసాయం అందించింది.
కార్మిక, ప్రజాసంఘాల సంఘీభావం
మహిళల పోరు యాత్ర రాష్ట్ర జాతాకు పలు కార్మిక, ప్రజా, ఉపాధ్యాయ, విద్యార్థి సంఘాలు సంఘీభావం తెలిపాయి. సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి పి.తేజేశ్వరరావు, యుటిఎఫ్‌ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌.కిషోర్‌ కుమార్‌, శ్రామిక మహిళా సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ కె.నాగమణి, వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఈశ్వరమ్మ, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి హరీష్‌ తదితరులు సంఘీభావం తెలిపారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు సిహెచ్‌.రమణి, జి ప్రియాంక, పలు సంఘాల నాయకులు సిహెచ్‌.రవీంద్ర, పొందూరు అప్పారావు, గొంటి గిరిధర్‌, జి.సింహాచలం, ఎ.మహాలక్ష్మి, ఎన్‌ బలరాం, పుణ్యవతి, అనురాధ తదితరులు పాల్గొన్నారు.