Jul 30,2023 20:55

సాలూరులో జరిగిన పోరుయాత్రలో మాట్లాడుతున్న ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు ప్రభావతి

ప్రజాశక్తి - సాలూరు : దేశం, రాష్ట్రంలో మహిళలకు రక్షణ కల్పించాలని, మద్యం మత్తు పదార్థాలను నియంత్రించాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి డిమాండ్‌ చేశారు. ఐద్వా చేపట్టిన హింస పై మహిళలు పోరు యాత్ర ఆదివారం సాలూరు పట్టణానికి చేరుకుంది. స్థానిక ఐద్వా నాయకులు టి.ఇందు ఆధ్వర్యాన మహిళలు పోరుయాత్ర బందం సభ్యులకు గాంధీనగర్‌ లో ఘనస్వాగతం పలికారు. అనంతరం సాలూరు రాజేశ్వరరావు పార్కు ఆవరణలో టి.ఇందు అధ్యక్షతన నిర్వహించిన సభలో ప్రభావతి మాట్లాడారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలున్నా హింసాత్మక ఘటనలు పెరుగుతున్నాయని చెప్పారు. చట్టాలను పటిష్టంగా అమలు చేయడం లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. ఇలాంటి ప్రభుత్వ విధానాలని మహిళా సంఘాలు, ప్రజాసంఘాలు ప్రతిఘటించాలని పిలుపునిచ్చారు. ప్రతి చోటా, ప్రతి క్షణం మహిళలపై దాడులు, అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయన్నారు. ప్రధానంగా మత్తు పదార్థాలు, మద్యమే కారణం అన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. హింసను ప్రేరేపించే అశ్లీల చిత్రాలను, ఇంటర్నెట్‌ కార్యక్రమాలు నిషేదించాలని డిమాండ్‌ చేశారు. మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు కమిషన్‌ ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఇటీవల రాష్ట్రంలో జరిగిన ఘటనలు ప్రభుత్వం నిర్లక్ష్యానికి నిదర్శనం అన్నారు. విశాఖలో వరలక్ష్మి హత్య సంచలనం కలిగించిందన్నారు. రేపల్లె రైల్వేస్టేషన్లోను, విజయనగరంలో ఇద్దరు పిల్లల తల్లి ఇంటిలోనే గ్యాంగ్‌ రేపు గురికావడం మన రాష్ట్రంలో నేరస్థితికి దర్పణమన్నారు. ఆంధ్రాకు అరకు ఏజెన్సీ మత్తుమందుల వ్యాపారులకు అడ్డాగా మారిందన్నారు. వారికి ప్రభుత్వాలు అండగా ఉన్నాయన్నారు. మద్యం మత్తు మందుల దురలవాటుతో యువత జీవితాలను కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఇన్ని నష్టాలు సమాజానికి కలుగుతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కనీసం స్పందించడంలేదన్నారు. మహిళలకు చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలని, నిందితులను ఫాస్ట్‌ ట్రాక్‌ కోర్టుల ద్వారా త్వరితగతిన విచారణ జరిపి కఠిన శిక్షలు విధించాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వం మీడియా మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటు చేయాలని, హింస, అశ్లీలత, అసమానతలను ప్రేరేపించే చిత్రాలు, టీవీ సీరియల్స్‌, ఇంటర్నెట్‌ కార్యక్రమాలను నిషేధించాలని, కాలేజీల్లో, పని ప్రదేశాల్లో వేధింపులను నిరోధించేందుకు అంతర్గత ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని, మత్తు పదార్థాలను నియంత్రించేందుకు చర్యలు చేపట్టాలన్నారు.పై డిమాండ్ల సాధనకు అన్ని పక్షాలను కూడ గట్టి ఐద్వా ఆందోళన సాగిస్తున్నది. రాష్ట్ర వ్యాపితంగా మహిళల పోరు యాత్ర చేపట్టనున్నది. ఆగస్టు 9న విజయవాడలో భారీ సభ నిర్వహించనుంది. ఈ కార్యక్రమంలో అందరూ పాల్గొనాలని, అన్ని విధాలా సహాయ సహాకారాలు అందించాలని ఆమె కోరారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు రమణి, పూర్ణ, పార్వతీపురం మన్యం జిల్లా కార్యదర్శి ఆర్‌.శ్రీదేవి, విజయనగరం జిల్లా కార్యదర్శి బి.రమణమ్మ , యుటిఎఫ్‌ రాష్ట్ర నాయకులు కె.విజయగౌరి, జిల్లా కమిటీ సభ్యులు రాజమణి, కోలక లీల, లక్ష్మీ, అంగన్వాడీ సంఘం జిల్లా నాయకులు ఇందిరా, అనసూయ, సిఐటియు నాయకులు టి.శంకర్‌,టి.స్వప్న పాల్గొన్నారు.
సీతానగరం : దేశంలోనూ, రాష్ట్రంలోనూ రోజు రోజుకు మహిళలపై దాడులు పెరుగుతున్నాయని, వాటిని ఖండించాలని ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలని ఐద్వా రాష్ట్ర అధ్యక్షులు బి.ప్రభావతి అన్నారు. మండలంలోని లచ్చయ్యపేటలో ఆదివారం బస్సు యాత్ర వచ్చింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ బిజెపి పాలనలో మహిళలపై దాడులు పెరిగాయన్నారు. మహిళలకు, చిన్నారులకు రక్షణ కల్పించే చట్టాలను కఠినంగా అమలు చేయాలన్నారు. మహిళలకు వేధింపులు ఎక్కువయ్యాయని, మద్యం, మత్తు పదార్థాల నియంత్రణకు చర్యలు చేపట్టాలన్నారు. ఆగస్టు 9న విజయవాడలో జరిగే బహిరంగ సభను జయప్రదం చేయాలని అన్నారు. కార్యక్రమంలో ఐద్వా నాయకులు ఆర్‌.శ్రీదేవి, వి.రామలక్ష్మి, ఇ.లక్ష్మి, ఆర్‌.లక్ష్మితో పాటు మహిళలు పాల్గొన్నారు.