Jun 28,2023 00:47

కలెక్టర్‌కు వినతిపత్రం ఇస్తున్న శివకుమారి, మల్లీశ్వరి

ప్రజాశక్తి - పల్నాడుజిల్లా కరస్పాండెంట్‌ : శ్రామిక మహిళల పట్ల వివక్షకు అడ్డుకట్ట వేసి మహిళలు పనిచేసే ప్రదేశాల్లో మెరుగైన వాతావరణం ఉండేలా చర్యలు తీసుకోవాలని శ్రామిక మహిళ సమన్వయ కమిటీ జిల్లా కన్వీనర్‌ డి.శివకుమారి, అంగన్వాడీ వర్కర్స్‌ అండ్‌ హెల్పర్స్‌ యూనియన్‌ (సిఐటియు) జిల్లా ప్రధాన కార్యదర్శి గుంటూరు మల్లీశ్వరి కోరారు. ఈ మేరకు పల్నాడు జిల్లా కలెక్టర్‌ ఎల్‌.శివశంకర్‌కు మంగళవారం వినతిపత్రం ఇచ్చారు. శివకుమారి మాట్లాడుతూ మహిళల పని ప్రదేశాల్లో ఫిర్యాదుల కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు. సంఘటిత అసంఘటిత రంగాలలో పనిచేస్తున్న మహిళల సంఖ్య గణనీయంగా పెరుగుతున్న నేపథ్యంలో పని ప్రదేశాలలో మహిళల పట్ల లైంగిక వేధింపులు ఎక్కువ అవుతున్నాయని, వాటి వల్ల మహిళలు తీవ్ర మానసిక వేదనకు గురవుతున్నారని చెప్పారు. శ్రామిక మహిళల పట్ల వేధింపులు, వివక్ష అనేక రూపాల్లో కొనసాగుతోందన్నారు. సమాన పనికి సమాన వేతన చట్టం ఉన్నా అనేక రంగాల్లో ఇది అమలు కావడం లేదని చెప్పారు. ప్రభుత్వ ప్రైవేటు సంస్థలలో మహిళలకు ప్రత్యేక వ్యక్తిగత మరుగుదొడ్లు, విశ్రాంతి గదులు, శిశు భద్రత కేంద్రం, తాగునీరు, ఇతర భద్రత సౌకర్యాలు లేక శ్రామిక మహిళలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. విద్యార్థినులు, మహిళలపై ప్రతి ఏటా దాడులు పెరుగుతున్నాయన్నారు. 2013లో వచ్చిన లైంగిక వేధింపుల నిరోధక చట్టం సక్రమంగా అమలు జరగడం లేదని, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులు నివారణకు నోడల్‌ అధికారులను నియమించాల్సి ఉన్నా నియమించలేదని, అంతర్గత కమిటీలు లేవని, అరకొరా ఉన్నా నామమాత్రంగా పని చేస్తున్నాయని వివరించారు. మహిళల పని ప్రదేశాల్లో కంప్లైంట్‌ కమిటీలు ఏర్పాటు చేయాలని కోరారు.