Dec 24,2021 07:10

ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే 2008లో లా కమిషన్‌ ప్రతిపాదించినట్లు యువతీ యువకులకు ఇద్దరికీ 18 సంవత్సరాల అర్హత వయసును ఎందుకు అంగీకరించలేదు? వ్యక్తిగత సంబంధాల విషయంలో మహిళా సాధికారత ఉండాలని ప్రభుత్వం అంతగా కోరుకుంటే అది ఇంతకంటే అనేక ముఖ్యమైన, అర్ధవంతమైన అడుగులు వేయవచ్చు. కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం చేయవచ్చు. మ్యారిటల్‌ రేప్‌ ను నేరంగా గుర్తించవచ్చు. గృహ హింస చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను మానుకోవచ్చు.

    కేంద్ర ప్రభుత్వం మహిళల వివాహ వయస్సును 21 ఏళ్లకు పెంచే బిల్లును ప్రవేశ పెట్టబోతోంది. పార్లమెంటులో మెజారిటీ వుంది కనుక ఈ బిల్లు చట్టంగా మారుతుంది. కానీ ఈ విషయంలో లోతుగా పరిశీలించవలసిన అనేక ముఖ్యమైన అంశాలు ఉన్నాయి. కనుక ప్రభుత్వం దీనిని హడావిడిగా ముందుకు తోసే ప్రయత్నం చేయకుండా స్టాండింగ్‌ కమిటీ ముందు పరిశీలనకు పంపాలనే ప్రతిపక్షాల ఆందోళన ఫలితంగా ప్రభుత్వానికి ఆ పని చేయక తప్పలేదు.
    18 సంవత్సరాల వయస్సులో ఒక మహిళ వయోజనురాలిగా పరిగణింపబడుతుంది. క్రిమినల్‌ చట్టాలతో సహా వయోజనులకు వర్తించే అన్ని చట్టాలూ పద్దెనిమిదేళ్ల మహిళలకూ వర్తిస్తాయి. ఆమె చేసే ఏ పనికైనా ఆమే బాధ్యురాలు. 18 నుండి 21 సంవత్సరాల మధ్య ఉన్న మహిళ నేరం చేసినట్లయితే ఆమెను వయోజనులుండే కారాగారంలోనే పెట్టి శిక్ష విధించవచ్చు. కానీ ఈ ప్రతిపాదిత బిల్లులో మాత్రం ఆమె పెళ్లి చేసుకునే విషయంలో చిన్న వయస్కురాలుగా పరిగణించబడుతోంది. ఇది మహిళా సాధికారత కాదు. ఇది మహిళలకు పసితనాన్ని ఆపాదించడమే. వయోజన వయస్సుకు విభజన లేదు. ఒక వయోజన యువతికి తన వివాహ విషయంలో నిర్ణయం తీసుకోవడాన్ని నిరాకరించడం ఒక తప్పిదమే. వయోజనులైన యువ జంటలు తరచుగా కుల మతాల అడ్డుగోడలను దాటి ఐచ్ఛిక వివాహాలు చేసుకోవడాన్ని ఇది చట్ట విరుద్ధంగా మార్చుతుంది. ప్రస్తుతం ఒక వయోజనురాలైన యువతి చట్టబద్దంగా తన ఇష్ట ప్రకారం భాగస్వామిని ఎంచుకునే స్వయం ప్రతిపత్తి సూత్రానికి ఈ బిల్లు విరుద్ధం. అంతేకాక న్యాయపరమైన సూత్రాలకు కూడా విరుద్ధంగా వుంటుంది.
     అంతేకాక భారతదేశం లోని యువతులు వారి జీవితాలకు సంబంధించిన నిర్ణయాలను తీసుకోవడంలో గతం కంటే మెరుగైన మార్పును సాధించారు. వారిలో చిన్న వయస్సు వివాహాలను ప్రతిఘటించడం, వాటిని ప్రశ్నించడం పెరిగింది. అంతేకాక తల్లిదండ్రుల, సామాజిక ఒత్తిళ్లను ప్రతిఘటిస్తున్న కొన్ని ప్రముఖ సంఘటనలు కూడా ఉన్నాయి. యువతులు సామాజిక బంధనాలను వదిలించుకొనే ఈ విధమైన పురోగమన చర్యల వల్లనే 'మినిస్ట్రీ ఆఫ్‌ స్టాటిస్టిక్స్‌ అండ్‌ ప్రోగ్రామ్‌ ఇంప్లిమెంటేషన్‌-2019' నివేదిక ప్రకారం భారతదేశంలో సగటు వివాహ వయస్సు 22.1కి పెరిగింది. కనుక వివాహ వయస్సు పెరుగుదలలో గణనీయమైన పురోగతి పెరుగుతున్న పరిస్థితులలో, అది స్వచ్ఛంద విషయమైనప్పుడు దానిని శిక్షార్హమైన అంశాల కిందికి మార్చడమెందుకు? యువతులు తమకిష్టమైన నిర్ణయాలను తీసుకొనే సామర్థ్యాలను పెంచే వాతావరణం కల్పించాలంటే వారికి సరైన విద్యా సౌకర్యాలు, ఉపాధి అవకాశాల హామీ కల్పించడం కీలకం. అంతేకానీ 18-21 ఏళ్ల వయస్సు మధ్యలో జరిగే అమ్మాయిల వివాహాలను నేరంగా పరిగణించడం సరైనది కాదు. ఇది ఎంత అహేతుకమైన విషయమంటే... ఒక వైపు మహిళల సంతాన సాఫల్యత తగ్గుతుండగా కొన్ని బిజెపి పాలిత రాష్ట్రాలలో జనాభాను నియంత్రించడానికి క్రూరమైన చట్టాలను ప్రతిపాదించడం లాంటిదే.
      కొంతమంది వివాహ వయస్సును పెంచడంలో తప్పేముందని అడుగుతున్నారు. కానీ వాస్తవం ఏమిటి? మన దేశంలో ఇప్పటికీ 18 సంవత్సరాల లోపున్న అనేక మందికి వివాహాలు జరుగుతున్న పరిస్థితులలో దీనికి గల కారణాలపై దృష్టి పెట్టడానికి ప్రాముఖ్యతను ఇవ్వాలి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే లెక్కల ప్రకారం చూస్తే గత ఐదేళ్ల కాలంలో బాల్య వివాహాలు 27 శాతం నుండి 23 శాతం వరకూ తగ్గినప్పటికీ ఈ తగ్గుదల పట్టణ ప్రాంతాలలోనే ఎక్కువగా ఉన్నది. గ్రామీణ ప్రాంతాలలో మాత్రం 20 నుండి 24 సంవత్సరాల మధ్యలో ఉన్న యువతులలో ప్రతి నలుగురిలో ఒకరు 18 సంవత్సరాల లోపే వివాహం చేసుకొంటున్నారు. దీనికి కారణాలు మనకు తెలిసినవే. కరోనా మహమ్మారి ద్వారా ఆర్థిక సంక్షోభం, సామాజిక దుష్ప్రభావాల మధ్య ఉన్న సంబంధం ప్రస్ఫుటంగా కనిపించింది. ఇందులో పిల్లలు సమిథలయ్యారు. గత ఏడాది మార్చి నుండి మే నెలల మధ్య లాక్‌డౌన్‌ కాలంలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ నిర్వహిస్తున్న పిల్లల హెల్ప్‌లైన్‌ నెంబరుకు బాల్య వివాహాలకు సంబంధించి 5200 పైచిలుకు ఫోన్లు వచ్చాయి. ఇందులో ఎక్కువ మంది పేద వర్గాలకు చెందినవారి పిల్లలు, 18 ఏళ్ల లోపు పెళ్ళైన వారికి సంబంధించినవే. దారిద్య్రం, పెరుగుతున్న వరకట్న డిమాండ్లు, తమ కుమార్తెలు లైంగిక దాడులకు గురవుతారేమోననే భయాందోళనలకు పరిష్కారంగా పిల్లలకు త్వరగా పెళ్లిళ్లు చేయడానికి తల్లిదండ్రులు మొగ్గు చూపుతున్నారు. బాల్య వివాహాలకు పితృస్వామ్య భావజాల సంస్కృతి కూడా తోడవడంతో తమ కుమార్తెలను పరాయి ధనంగా చూస్తున్నారు. అంతేకాక తండ్రి ఒక సంరక్షకుడిగా తన కుమార్తెను భర్తకు అప్పగించడం ద్వారా తన పవిత్ర కర్తవ్యం నెరవేర్చినట్లుగా భావిస్తాడు.
      గత ఏడాది లాక్‌డౌన్‌ సమయంలో స్త్రీ శిశు సంక్షేమ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యం లోని పిల్లల హెల్ప్‌లైన్‌ సెంటర్‌ ద్వారా 5200 బాల్య వివాహాలను అడ్డుకున్నారు. ప్రస్తుత పాలక వర్గాలు సమాజంలో నెలకొన్న వివిధ ఆచారాలతో అనేక మినహాయింపులు పొందుతున్నారు. ఆడపిల్లలకు ఉన్నత విద్యా సౌకర్యాలు కల్పిస్తున్న కేరళ లాంటి రాష్ట్రాలు బాల్య వివాహాలను చాలా విజయవంతంగా అరికట్టగలిగాయి. భారతదేశంలో వివాహానికి చట్టబద్ధమైన వయస్సును బాలికలకు 15 సంవత్సరాల నుండి 18కి బాలురకు 18 సంవత్సరాల నుండి 21కి 1978లో మార్చారు. ఈ చట్టం దేశంలోని అందరికీ వర్తిస్తుంది. బాల్య వివాహాలను నిరోధించే ఈ చట్టానికి ఏ పర్సనల్‌ లా అయినా సరే కట్టుబడి వుండవలసిందేనని కోర్టులు పదే పదే చెపుతున్నాయి. అయినా కూడా ఈ 43 సంవత్సరాల కాలంలో 18 ఏళ్ల వయస్సు అర్హత కలిగివున్నా కూడా మనం బాల్య వివాహాలను అరికట్టడంలో విఫలమైన పరిస్థితిలో 21 ఏళ్లకు వయో పరిమితిని పెంచితే అత్యధిక జనాభా, అందులోనూ ముఖ్యంగా పేదలు శిక్షార్హమవుతారు.
     ఈ బిల్లు తేవడం ద్వారా చిన్న వయసులో పెళ్ళయి పిల్లలను కనే స్థితి నుండి యువతుల ఆరోగ్యాన్ని కాపాడవచ్చుననీ అందుకే వివాహ వయసును 21కి పెంచుతున్నామని ప్రభుత్వ వాదన. ఇది శిశు జననాలను ఆపుతుందనీ వారి ఆరోగ్యాలు కాపాడబడతాయనీ చెప్తోంది. ఇది చాలా కపట వాదన. పౌష్టికాహార లోపం, మాతా శిశు మరణాలు లాంటి ముఖ్యమైన సమస్యలు రాజకీయ విధానాలకు సంబంధించిన విషయాలు. ప్రభుత్వం ఒకవైపు ప్రజారోగ్యానికి సంబంధించిన నిధులను తగ్గించి వేస్తూ, ఆరోగ్య రంగాన్ని ప్రయివేటు పరం చేస్తోంది. ఆహార వస్తువుల ధరలు పెరుగుతున్నా ప్రజలకు ఆహార భద్రత వ్యవస్థను కల్పించడంలేదు. కానీ ఇంకోవైపు మహిళల ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్నట్లు చెప్తోంది. ప్రజల విద్యా ఆరోగ్యాలకు బడ్జెట్‌ను పెంచే బాధ్యత నుండి తప్పుకుంటున్న ప్రభుత్వం వయోజన యువతుల హక్కులను పునరుత్పత్తి ఆరోగ్యం పేరుతో హరించాలని చూస్తోంది.
      మహిళల వివాహ వయసును 21కి పెంచడం ద్వారా వివాహార్హత వయసును యువతీ యువకులకు సమానం చేశామని ఆ విధంగా మహిళా సాధికారతను సాధించామనే ప్రభుత్వ వాదనను మనం అంగీకరించాలని ప్రభుత్వం ఆశించింది. ప్రభుత్వానికి అంత చిత్తశుద్ధి ఉంటే 2008లో లా కమిషన్‌ ప్రతిపాదించినట్లు యువతీ యువకులకు ఇద్దరికీ 18 సంవత్సరాల అర్హత వయసును ఎందుకు అంగీకరించలేదు? వ్యక్తిగత సంబంధాల విషయంలో మహిళా సాధికారత ఉండాలని ప్రభుత్వం అంతగా కోరుకుంటే అది ఇంతకంటే అనేక ముఖ్యమైన, అర్ధవంతమైన అడుగులు వేయవచ్చు. కుల దురహంకార హత్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యేక చట్టం చేయవచ్చు. మ్యారిటల్‌ రేప్‌ ను నేరంగా గుర్తించవచ్చు. గృహ హింస చట్టాన్ని నీరుగార్చే ప్రయత్నాలను మానుకోవచ్చు. ఇలాంటి అనేక ఉదాహరణలున్నాయి.
     ప్రపంచం లోని అనేక దేశాలలో ఒక వ్యక్తిని 18 ఏళ్లకు మేజర్‌గా పరిగణిస్తారు. దాన్నే వివాహ వయో పరిమితిగా కూడా పరిగణిస్తుంటారు. ఈ రెండు అంశాలలో వయసుకు సంబంధించి పెద్దగా తేడాలు లేవు. యునైటెడ్‌ నేషన్స్‌ జనరల్‌ అసెంబ్లీ 1989లో వివాహ వయోపరిమితి పద్దెనిమిదేళ్లుగా ఉండాలని ప్రతిపాదిస్తూ చేసిన తీర్మానంపై భారత్‌ కూడా సంతకం చేసింది. ఈ ప్రపంచవ్యాప్త అంగీకారానికి ఇప్పుడు విరుద్ధంగా వెళ్ళడానికి ప్రభుత్వం చెప్పే కారణాలు ఆమోదయోగ్యంగా లేవు. ఇది భవిష్యత్తులో సమాజంపై వ్యతిరేక ప్రభావాలనే చూపిస్తుంది.
 

(వ్యాసకర్త : సిపి(ఐ)ఎం పొలిట్‌బ్యూరో సభ్యులు,
మాజీ ఎం.పి)
బృందాకరత్‌

బృందాకరత్‌