శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎ. కమల
ప్రజాశక్తి-పెనుగంచిప్రోలు
పెనుగంచిప్రోలు మండలంలో ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, ఆశ వర్కర్స్ యూనియన్ నాయకురాలు పి .సుజాత అధ్యక్షతన అంతర్జాతీయ మహిళా దినోత్సవ సదస్సు, సిఐటియు మండల ఆఫీసు వద్ద జరిగింది. ఈ సదస్సుకి ముఖ్యఅతిథిగా పాల్గొన్న శ్రామిక మహిళా జిల్లా కన్వీనర్ ఎ. కమల మాట్లాడుతూ, ప్రభుత్వ విధానాల వలన మహిళలు నేటికీ అణిచివేతకు, హింసకు, గురవుతూనే ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళలకు ఓటు హక్కు కావాలని, లింగ వివక్షత పోవాలని,సమాన వేతనం ఇవ్వాలని, పని గంటలు అమలు చేయాలని, తదితర సమస్యల పరిష్కారం కోసం క్లారా జట్కీన్ నాయకత్వంలో ఆనాడు మహిళలు పెద్ద ఎత్తున, మహిళల యొక్క హక్కుల కోసం పోరాడారని, అందుకోసం ప్రాణ త్యాగాలు చేసి ఉరికంబాల కెక్కి జైలులో ఉన్నారని, ఆ త్యాగాల ఫలితమే మహిళలకు ప్రత్యేక హక్కులు సాధించి పెట్టిన ప్రత్యేక దీక్షాధినమే, అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఆమె గుర్తు చేశారు. కానీ నేటి ప్రభుత్వాలు వాటిని కూడా ఈవెంట్ గా మార్చి, అదేదో మహిళలకు పండగ లాగా పూలదండలతో పన్నీర్లతో చాలు వాళ్ళు కప్పి, గిఫ్ట్ ఇచ్చి మహిళలను పొగుడుతూ కొనసాగే కార్యక్రమంగా జరుపుతున్నారని ఆమె విమర్శించారు. మహిళల హక్కులను అమలు చేయకుండా, మహిళా చట్టాలను తమ చుట్టాలుగా మార్చుకుని, నేరస్తులకు కొమ్ముకాస్తూ, అండగా ఉంటున్నారని విమర్శించారు. చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్ కావాలని రాజ్యసభలో బిల్ అయినప్పటికీ, లోక్ సభలో అది ఆమోదానికి నోచుకో లేదని అన్నారు. ఈ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా అన్ని రంగాల్లో ఉన్న మహిళలు, పెద్ద ఎత్తున ఐక్యంగా పోరాడాలని ఆమె పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కౌలు రైతు సంఘం నాయకులు వి.గురవయ్య, రైతు సంఘం నాయకులు వై.రామారావు, మహిళా సంఘం నాయకులు టి.సుధా అంకుల్, ఆశ వర్కర్లు, మథ్యాన భోజనం కార్మికులు పాల్గొన్నారు.










