ప్రజాశక్తి-అద్దంకి: ఎన్‌టిఆర్ ప్రవేశపెట్టిన ఆస్తి హక్కు చట్టానికి తూట్లు పొడిచిన సిఎం జగన్మోహన్ రెడ్డికి మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని తెలుగు మహిళా నాయకులు పేర్కొన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం పురస్కరిం చుకొని తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడుతో అద్దంకి నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ కార్యాలయంలో శాసనసభ్యులు గొట్టిపాటి రవికుమార్ ఆదేశాల మేరకు జరిగిన సీబీన్ కనెక్ట్ జూమ్ కాన్ఫరెన్స్‌లో వారు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మహిళా నేతలు మాట్లాడుతూ మహిళా భద్రత పట్టని జగన్‌కు మహిళల గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. దశాబ్దాల అణిచివేతపై అలుపెరుగని పోరాటం చేసి సాధించుకున్న మహిళా దినోత్సవ మూలాలు జగన్మోహన్‌రెడ్డి అసమర్థ పాలన, ఉదాసీన వైఖరితో కనుమరుగవుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నాలుగేళ్లలో మహిళా సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించి, మహిళా భద్రతను గాలికొదిలేసిన ముఖ్యమంత్రి జగన్‌కు మహిళల గురించి మాట్లాడే నైతిక అర్హత లేదని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని అత్యాచారాలకు కేరాఫ్ అడ్రస్‌గా మార్చేసిన జగన్‌కు మహిళల పేరు ఉచ్ఛరించే అర్హత లేదని అన్నారు. సీఎం నివసించే తాడేపల్లిలో వరుస అత్యాచారాలు జరుగు తున్నా, గంజాయి యథేచ్ఛగా లభిస్తున్నా తనకేం పట్టనట్టు వ్యవహరించడం మహిళా రక్షణపై జగన్‌రెడ్డి చిత్తశుద్ధి ఏపాటిదో అర్థం చేసుకోవచ్చని తెలిపారు. మహిళలపై నేరాలు దేశంలో 3వ వంతు మన ఏపీలోనే జరగడం ప్రభుత్వ శాంతిభద్రతల వైఫల్యం కాదా అని ప్రశ్నించారు. దిశ చట్టం, దిశ యాప్, దిశ పోలీస్ స్టేషన్ అంటూ ప్రచారార్భాటం చేస్తున్న ముఖ్య మంత్రి ఆచరణలో ఒక్క ఆడబిడ్డను కూడా కిరాతకుల నుంచి కాపాడలేదని పరిస్థితి ఏర్పడిందన్నారు. మహిళల ఆర్థిక స్వావలంబ నకు చంద్రబాబు గారు స్థాపించిన డ్వాక్రా సంఘాలను జగన్‌రెడ్డి తన చేతకాని పాలనతో ప్రశ్నార్థకం చేశాడు. అభయహస్తం నిధులను కొల్లగొట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నాసి రకం మద్యంతో మహిళల మాంగల్యాలు మంట గలిపిన వైసిపికి.. మహిళల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ధ్వజమెత్తారు. నాలుగేళ్లుగా పెళ్లికానుకలకు ఎగనామం పెట్టారని అన్నారు. నిత్యావసర ధరలు పెంచారు. పన్నుల మోతతో మధ్యతరగతి ప్రజలపై మోయలేని భారం వేశారు. చెల్లెలు డాక్టర్ సునీతకే రక్షణ కల్పించలేని జగన్ రాష్ట్రంలోని మహిళలకు ఏం రక్షణ కల్పిస్తాడని ప్రశ్నించారు. మహిళల పట్ల జగన్‌రెడ్డిది మొసలి కన్నీరుగా అభివర్ణించారు. మహిళలను మోసం చేసిన జగన్‌రెడ్డికి రాబోయే రోజుల్లో మహిళలందరూ ఏకమై తగిన గుణపాఠం చెప్పాలని కోరారు. ఈ కార్యక్రమం లో నియోజకవర్గ తెలుగు మహిళా అధ్యక్షురాలు అన్నంగి మనోహరమ్మ, బాపట్ల పార్లమెంటు తెలుగు మహిళా ఉపాధ్యక్షురాలు నాగబోతు సుజాత, అద్దంకి పట్టణ మహిళా అధ్యక్షురాలు పిన్నింటి శ్రీదేవి, మహిళా కౌన్సిలర్లు, మహిళా కమిటీ సభ్యులు పాల్గొన్నారు.










