Nov 06,2023 21:30

విజయనగరం : విద్యార్థినులతో దిశా యాప్‌ డౌన్‌లోడ్‌ చేయిస్తున్న వన్‌టౌన్‌ ఎస్‌ఐ

విజయనగరం:  మహిళల చేతిలో రక్షణ చక్రం దిశా (ఎస్‌ఒఎస్‌) యాప్‌ అని జిల్లా ఎస్‌పి ఎం.దీపిక అన్నారు. ప్రతీ మహిళ తమకు రక్షణగా నిలిచే చట్టాలు గురించి తప్పనిసరిగా అవగాహన కలిగి ఉండాలన్నారు. మహిళలు, విద్యార్థులకు, వారికి రక్షణగా ఉండే చట్టాలు, ఆపద సమయంలో పోలీసుల సహాయం పొందే విధానం, దిశా యాప్‌ ను వినియోగించి రక్షణ పొందడం పట్ల అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీసుశాఖ తరుపున చర్యలు చేపడుతున్నామన్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, మహిళా రక్షక్‌, ఇతర పోలీసు సిబ్బంది ప్రత్యేక డ్రైవ్‌ చేపట్టి దిశా యాప్‌పై అవగాహన కల్పించారు. విద్యాసంస్థలు, బస్టాండ్‌లు, రైల్వే స్టేషన్‌ లను సందర్శించి మహిళల రక్షణకు బాసటగా నిలిచే దిశ యాప్‌ పట్ల అవగాహన కల్పించారు. దిశా ఎస్‌ఒఎస్‌ మొబైల్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించి యాప్‌ను ఎట్టి పరిస్థితుల్లోను డిలీట్‌ చెయ్యవద్దని కోరారు. ఏ కారణంతో నైనా డిలిట్‌ చేస్తే, వారు ఆపద సమయంలో ఉన్నపుడు పోలీసుల సహాయం పొందే వెసులుబాటును కోల్పోతారని వివరించారు. ఈ ప్రత్యేక డ్రైవ్‌లో 14,236 మందితో దిశ ఎస్‌ఒఎస్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేయించినట్లు ఎస్‌పి తెలిపారు.
స్పందనకు 45 ఫిర్యాదులు
జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన స్పందనలో 45 మంది తమ సమస్యలపై ఎస్‌పి ఎం.దీపికకు ఫిర్యాదు చేశారు. ప్రజల నుంచి ఎస్‌పి ఫిర్యాదులను స్వీకరించి, వారి సమస్యలను తెలుసుకొని, సంబంధిత పోలీసు అధికారులతో వీడియోకాన్ఫరెన్సులో మాట్లాడారు. ఫిర్యాదుదారుల సమస్యల పరిష్కారానికి చర్యలు చేపట్టాలని సూచించారు. కార్యక్రమంలో అదనపు ఎస్‌పి అస్మా ఫర్హీన్‌, దిశ డిఎస్‌పి ఆర్‌.శ్రీనివాసరావు, డిసిఆర్‌బి సిఐ జె.మురళి, ఎస్‌బి సిఐ ఇ.నర్సింహమూర్తి, డిసిఆర్‌బి ఎస్‌ఐలు వాసుదేవ్‌, ప్రభావతి, పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.
మహిళల రక్షణ కోసమే దిశ
బొబ్బిలి : మహిళల రక్షణ కోసమే ప్రభుత్వం దిశ చట్టాన్ని, యాప్‌ను తీసుకొచ్చిందని ఎస్‌ఐ సత్యనారాయణ, ఎఎస్‌ఐలు జి.భాస్కరరావు, స్వామి, సన్యాసిరావు అన్నారు. దిశ చట్టం, యాప్‌పై పట్టణంలో నాలుగు టీములుగా పోలీసులు ప్రత్యేక డ్రైవ్‌ నిర్వహించి, విద్యార్థులకు అవగాహన కల్పించారు. విద్యార్థుల మొబైళ్లలో దిశ యాప్‌ను ఇన్‌స్టాల్‌ చేయించారు. ఆపదలో ఉన్నవారు దిశ యాప్‌ను వినియోగించాలని కోరారు. కార్యక్రమంలో పోలీసులు సిబ్బంది పాల్గొన్నారు.
దిశ యాప్‌తో మహిళలకు ప్రత్యేక రక్షణ
భోగాపురం : దిశ యాప్‌ మహిళలకు ఎంతో రక్షణగా ఉంటుందని భోగాపురం ఎస్‌ఐ కృష్ణమూర్తి అన్నారు. స్థానిక లెండి కళాశాలలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ యాప్‌ అత్యవసర సమయాల్లో మహిళలకు ఎంతగానో ఉపయోగపడు తుందన్నారు. గ్రామాలతో పాటు జంక్షన్ల వద్ద పోలీస్‌ సిబ్బందితో పాటు మహిళా పోలీసులు కలిసి ఉమ్మడిగా మహిళలతో ఈ యాప్‌ని డౌన్‌లోడ్‌ చేసి ఎలా వాడాలో అవగాహన కల్పించారు. సుమారు వెయ్యి మందితో యాప్‌ను డౌన్‌లోడు చేయించినట్లు తెలిపారు.
దిశ యాప్‌ పై యువతకు అవగాహన
రేగిడి : ఉంగరాడ మెట్ట వద్ద ఎస్‌ఐ ఇ. శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సోమవారం దిశ యాప్‌ పై ప్రయాణికులకు అవగాహన కల్పించారు. దిశ యాప్‌తో ఎంతో మేలు చేకూరుతుందన్నారు. ప్రమాదంలో ఉన్న మహిళలు ఈ యాప్‌ ద్వారా క్షణాలలో రక్షణ పొందవచ్చు అని చెప్పారు. గ్రామాల్లో, ప్రధాన రహదారుల్లో దిశ యాప్‌ పై విస్తృతంగా ప్రజలను, యువతను చైతన్యవంతులు చేసేందుకు కృషి చేస్తున్నట్లు ఆయన వివరించారు. ఆయనతో పాటు పోలీస్‌ సిబ్బంది పాల్గొన్నారు.