Oct 20,2020 07:20

నూతన విద్యా విధానం (ఎన్‌ఇపి)ను జులై 29న క్యాబినెట్‌ ఆమోదించింది. ఇది ప్రతి కుటుంబాన్ని ప్రభావితం చేస్తుంది. 2015 నాటికి లక్ష పాఠశాలలు ఏకోపాధ్యాయ పాఠశాలలుగా ఉన్నాయి. వీటన్నింటినీ కలిపి క్లస్టర్‌ స్కూళ్లుగా మార్చనున్నారు. దానివల్ల అనేక గ్రామాల్లో స్కూళ్ళు మూతపడవచ్చు. గ్రామాల్లో అందుబాటులో స్కూలు లేనట్లయితే ప్రధానంగా ఆడపిల్లల్ని దూరంగా పంపించి చదివించడానికి సిద్ధపడరు. ఇది ఆడపిల్లల మీద చాలా పెద్ద ప్రభావం కలిగిస్తుంది. 3 నుంచి 8 సంవత్సరాల వరకు చిన్నారులను ఒక గ్రూపుగా చేసి...ప్రీ ప్రైమరీ పాఠశాలగా అంగన్‌వాడీ బడిని మార్చనున్నారు. అంగన్‌వాడీ ఉద్యోగినులు పూర్తికాలం ఉద్యోగులుగా లేరు. ప్రధానంగా పోషకాహారం అందించడం, దానితోపాటు పిల్లల మెదడు ఎదిగే పద్ధతుల్లో పాటలు, ఆటలు నేర్పే విధానం కొనసాగుతోంది. దీనికి స్కూలు విద్యను జోడించడం వల్ల వచ్చే ప్రయోజనం లేకపోగా నాణ్యమైన విద్యను కూడా అందించగలిగే పరిస్థితులు ఉండవు. అంగన్‌వాడీ టీచర్లు తమను ఉద్యోగులుగా గుర్తించాలని చిరకాలంగా చేస్తున్న డిమాండ్లను ప్రభుత్వం పట్టించుకోలేదు. ఇప్పుడు అదనపు బాధ్యతలను మోపడం అంటే మహిళల శ్రమను గుర్తించని వైఖరికి ఇది తార్కాణం. మహిళల శ్రమను తక్కువ చేసే పితృస్వామ్య భావజాల పరిరక్షణ ఇది.


వంట నేర్చుకుందాం !
ఆరో తరగతి నుంచి 11 సంవత్సరాల వయసులో సాంప్రదాయ కోర్సులు వృత్తి విద్యా కోర్సులు నేర్పబడతాయని చెప్పారు. 2016 లోనే బాల కార్మికుల చట్టంలో మార్పు తీసుకు వస్తూ వాళ్ల కుటుంబ సంస్థల పనులలో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. నూతన విద్యా విధానం దానికి కొనసాగింపుగా ఉంది. ఫలితంగా ఆడపిల్లలకు ఇంటి పని, వంట పని, శుభ్రం చేయడం, కూరగాయలు తరగడంలో శిక్షణ ఇవ్వవచ్చు. సర్టిఫికెట్‌ ఇవ్వవచ్చు. అలాగే జుట్టు కత్తిరించడం, చెప్పులు కుట్టడం, సంప్రదాయ వృత్తులు కూడా చోటుచేసుకుంటాయి. వృత్తిదారుల కుటుంబాల బిడ్డలను ఆ సంప్రదాయ వృత్తులకు నెట్టివేయడం జరుగుతుంది. కుల వృత్తులను, సాంప్రదాయ వృత్తులను ప్రవేశపెట్టి తిరిగి కుల, లింగ వ్యత్యాసాలను బలపరిచే ప్రమాదం పొంచి ఉంది.


విద్యావకాశాల లేమి
డ్రాపవుట్‌ అయిన పిల్లల కోసం నిర్మించిన కస్తూర్బా స్కూళ్ల గురించి ఎన్‌ఇపి లో ఏమీ పేర్కొనలేదు. ఇప్పటికే దళిత, ఆదివాసీలు 28 శాతం మంది స్కూల్‌ మానేస్తున్నారు. రాబోయే కాలంలో ఈ విధానంలో మరింతగా స్కూలు వదిలేసే పిల్లలు పెరగవచ్చు. ఉన్నత విద్యకు సంబంధించి మధ్యలోనే మానివేయడానికి వీలు కల్పిస్తూ ఏర్పాటు చేయబడింది. పేద పిల్లల్లో చదువు మానేసే వారి సంఖ్యను పెంచుతుంది. గతంలో ఆడపిల్లకు పెళ్లి చేసేటప్పుడు ఇంటర్‌ వరకు పూర్తిగానివ్వండి, డిగ్రీ వరకు పూర్తిగానివ్వండి అని చెప్పే పద్ధతి కూడా పోతుంది. ఎప్పుడైనా చదువు ఆపుకోవచ్చు. సర్టిఫికెట్‌ వస్తుంది. కాబట్టి పెళ్లి చేయండి. అనేది ముందుకు వస్తుంది.


ఆన్‌లైన్‌ విద్య
పట్టణ ప్రాంతాల్లో 100 మందిలో ప్రస్తుతం 48 మంది నెట్‌ వినియోగిస్తుండగా...గ్రామాలలో 25 శాతం మందికి మాత్రమే ఈ సౌకర్యం ఉంది. మొబైల్‌ను మగవారు 67 శాతం, ఆడవాళ్ళు 29 శాతం వాడుతున్నారు. ఆన్‌లైన్‌ సదుపాయాలు లేని పేదలు విద్య అందుకునే అవకాశాన్ని కోల్పోతున్నారు. అమ్మాయిల మీద ఈ ప్రభావం మరింతగా ఉంటుంది. కుమార్తెను చదివించడానికి ఒక తండ్రి తనకున్న ఒక్క ఆవును అమ్ముకున్న వార్త పత్రికల్లో వచ్చింది. ఆడపిల్లలకి ఫోన్ల సదుపాయం మన సమాజంలో తక్కువ. ఇంట్లో మహిళలకు స్మార్ట్‌ ఫోన్లు అవసరం లేదనేది గణనీయంగానే ఉన్న భావజాలం. ఆడపిల్లకా! మగ పిల్లవాడికా! ఎవరికి స్మార్ట్‌ ఫోన్‌ ఇవ్వాలి? అంటే ముందు మగపిల్లలకే ప్రాధాన్యత ఉంటుంది. యూపీలో 500 కుటుంబాల్లో సర్వే చేయగా 8 శాతం అమ్మాయిలకు మాత్రమే నెట్‌ సదుపాయం వుంది. ఇంట్లో నెట్‌ సక్రమంగా రాకపోతే నెట్‌ వచ్చే ప్రాంతానికి వెళ్ళగలిగే భౌతిక పరిస్థితులు, రక్షణ లేకపోవడంతో ప్రస్తుతం ఆన్‌లైన్‌ పాఠాలు అందుకోవడంలో ఆడపిల్లలు మరింత వెనకబడి ఉన్నారు. దళితులు, శూద్రులు, మహిళలు విద్యకు అనర్హులు అన్న మనువాదం అమలు అవుతుంది.


జండర్‌ స్పృహ లేని 'స్కూల్‌ కాంప్లెక్స్‌'లు
ఇప్పటికే ఏడు కిలోమీటర్ల వరకు స్కూల్‌కి నడిచి వెళ్ళే బాలికలు ఉన్నారు. కాంప్లెక్స్‌ పాఠశాలలు ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన ఆడపిల్లలకు శాపం అవుతుంది. 15-18 సంవత్సరాల పిల్లల్లో 40 శాతం మంది అమ్మాయిలు స్కూళ్ళు మానివేస్తున్నట్లు బాలల హక్కుల జాతీయ కమిషన్‌ పేర్కొంది. లైంగిక వివక్షను అధిగమించేందుకు ఎన్‌ఇపి లో సానుకూలమైన చర్చలు, పరిష్కారాలు లేవు. లైంగిక అసమానతలు అధిగమించడానికి ఇచ్చే నిధులు కేంద్ర షరతులకు లోబడి ఇవ్వబడతాయి. మహిళల ఎడల వివక్షతను అధిగమించడం, సమాన అవకాశాలను కల్పించడం గురించి ఈ డాక్యుమెంట్‌ విస్మరించింది. నివాస ప్రాంతాల్లో ఉండే బస్తీ పాఠశాలలు అమ్మాయిలకు వరం లాంటివి. కానీ కొద్ది మంది పిల్లలున్న స్కూళ్లను మూసివేయడం ఇప్పటికే మన రాష్ట్రంతో సహా ప్రారంభమైంది. 2017లో 13 రాష్ట్రాలలో 1,47,494 స్కూళ్ళను మూసివేశారు. రాబోయే రోజుల్లో 25 శాతం స్కూళ్ళు దేశవ్యాప్తంగా మూసివేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇది ఓపెన్‌ విద్యను ప్రోత్సహించడానికి దారితీయవచ్చు. ఇందులో పిల్లలు కొందరు డిగ్రీ సర్టిఫికెట్లు తెచ్చుకోవచ్చు. కానీ నాణ్యమైన విద్యను, స్వేచ్ఛను, కదలికను కోల్పోతారు. ముఖాముఖి నేర్చుకోవడాన్ని, బహుముఖ జ్ఞానాన్ని కోల్పోతారు. స్కూల్‌ దూరమయ్యేకొద్దీ అమ్మాయిలు స్కూళ్లలో చేరడం తగ్గిపోతుందని 'మలాలా ఫండ్‌' ప్రతినిధి 'అనుభూతి పాత్ర' పేర్కొన్నారు. యుఎన్‌ఒ ప్రకటించిన అభివృద్ధి లక్ష్యాలు గాని, లైంగిక అసమానతలు, లైంగిక వేధింపుల గురించి కానీ ఇందులో లేవు.


విలువ లేని శ్రామికులుగా బాలికలు
నూతన ఆర్థిక విధానాల నేపథ్యంలో మహిళల పని సంఘటిత రంగంలో తగ్గిపోతుంది. 2005లో మహిళలకు 36 శాతం ఉపాధి ఉంది. ఇప్పుడు అది 21 శాతానికి తగ్గిపోయింది. ఎన్‌ఇపి వలన ఆడపిల్లలు లెక్కలు, సైన్స్‌, మెకానికల్‌ విద్య, సాఫ్ట్‌ స్కిల్స్‌ అందుకునే అవకాశాన్ని కూడా కోల్పోవచ్చు. విద్యా హక్కును 18 సంవత్సరాల వరకూ పెంచే ప్రతిపాదన ఇందులో లేదు.
ఇప్పుడు వివాహ వయస్సు 18 సంవత్సరాలు ఉన్నప్పటికీ 14 ఏళ్లకే వివాహాలు చేసే పద్ధతి కొనసాగుతూనే ఉంది. మహిళల వివాహ వయస్సు కూడా 21 సంవత్సరాలు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తుంది. కానీ విద్యా హక్కు లేకుండా, ఉచితంగా విద్య పొందే సదుపాయం లేకుండా కుటుంబాలు ఆర్థిక సదుపాయం ఇవ్వలేక ఆడపిల్లలు చదువుకోగలిగే పరిస్థితి ఏర్పడదు. పర్యవసానంగా నామమాత్రమైన వేతనాలతో అసంఘటిత రంగ శ్రామికులుగా మహిళలు మిగిలిపోయే పరిస్థితి ఏర్పడుతుంది.


స్త్రీత్వం
రాజ్యాంగ లక్ష్యాలకు అనుగుణంగా సమానత్వాన్ని అందుకునేందుకు అవసరమైన చర్యలను చేపట్టే విధానాలు ఎన్‌ఇపి లో కనిపించవు. దానికి భిన్నంగా కాలం చెల్లిన మూఢ భావజాలానికి అనుగుణంగా స్త్రీలకు ఉండవలసిన లక్షణాలను గురించి నేర్పే విద్య ఉండాలని స్పష్టంగా పొందుపరచటం జరిగింది. సమానత్వం, సాధికారత స్థానంలో మహిళలను సేవికలుగా, రెండవ స్థాయి పౌరులుగా ఉండే విద్యను రూపొందించడం ఈ విద్యా విధానం ప్రత్యేకత. మహిళలను వెనక్కి నెట్టే ఈ మనువాద, ఆధిపత్య ధోరణి దేశాభివృద్ధికి, సమాజాభివృద్ధికి అత్యంత హానికరం.
 

డి. రమాదేవి

(వ్యాసకర్త ఐద్వా రాష్ట్ర కార్యదర్శి)