Sep 29,2023 00:39

శిక్షణ పొందుతున్న మహిళలతో మాట్లాడుతున్న మధు

ప్రజాశక్తి-తాడేపల్లి : మహిళల ఆర్థికాభివృద్ధికి మాకినేని బసవపున్నయ్య విజ్ఞాన కేంద్రం (ఎంబివికె) పని చేస్తుందని ఎంబివికె ట్రస్టు చైర్మన్‌ పి.మధు అన్నారు. తాడేపల్లి పట్టణంలోని మేకా అమరారెడ్డి భవన్‌లో కొనసాగుతున్న కుట్టు శిక్షణా కేంద్రాన్ని ఆయన గురువారం సందర్శించారు. శిక్షణలో ఉన్న మహిళలను వివరాలు అడిగి తెలుసుకున్నారు. శిక్షణిస్తున్న శిక్షకురాలికి కొన్ని సూచనలు చేశారు. అనంతరం మధు మాట్లాడుతూ మహిళలంతా పట్టుదలగా కుట్టుశిక్షణ నేర్చుకోవాలన్నారు. అన్ని మెళకువలు తెలుసుకుని బాగా రాణించాలని, కుటుంబాలు ఆర్థిక అవసరాలు తీర్చుకునేందుకు చేదోడు వాదోడుగా ఉండాలని ఆకాంక్షించారు. మహిళల అభ్యున్నతి కోసం ఎంబివికె పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందన్నారు. విజ్ఞాన కేంద్రాల రాష్ట్ర కన్వీనర్‌ పి.మురళీకృష్ణ మాట్లాడుతూ తాడేపల్లిలో జరుగుతున్న కుట్టు శిక్షణ బాగుందని, వెంటనే రెండో బ్యాచ్‌కు కూడా శిక్షణ మొదలుపెడతామని చెప్పారు. ఎంబివికె బాధ్యులు పి.విజయ మాట్లాడుతూ విజయవాడ నగరంలో కుట్టు నేర్చుకుని మహిళలు పెద్దఎత్తున ఉపాధి పొందుతు న్నారని, నెలకు రూ.5-10 వేల వరకు సంపాదిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో మంగళగిరి తాడేపల్లి బాలోత్సవం కోశాధికారి జి.సుబ్బారెడ్డి, ట్రైనర్‌ నాగూర్‌బి పాల్గొన్నారు.