ప్రజాశక్తి-వేటపాలెం: మహిళల ఆర్థికాభివృద్ధికి ఆసరా పథకం తోడ్పడుతుందని ఎమ్మెల్యే కరణం బలరాం అన్నారు. మూడో విడత వైఎస్సార్ ఆసరా చెక్కుల పంపిణీ కార్యక్రమం స్థానిక మండల పరిషత్ ప్రాంగాణంలో డిఆర్‌డిఎ వెలుగు కార్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే బలరాం, ఎమ్మల్సీ పోతుల సునీత, యువ నాయకుడు వెంకటేష్‌బాబు ముఖ్య నాయకులుగా హాజరై ప్రసంగించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బలరాం మాట్లాడుతూ వరుసగా మూడోసారి ఆసరా కింద చెక్కులు అందించడం ఆనందంగా ఉందని అన్నారు. మహిళల పట్ల ముఖ్యమంత్రి జగన్‌కు ప్రత్యేక శ్రద్ధ, అభిమానం ఉన్నాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు నేరుగా లబ్ధిదారుల ఖాతాలకు జమ అవుతున్నాయన్నారు. ఈ పథకాలతో పేదప్రజలు ఆర్థికంగా నిలదొక్కుకోవాలని ఆకాంక్షించారు. వేటపాలెం మండలంలో ఉన్న 1,313 పొదుపు గ్రూపులకు రూ.8,35,36,808 కోట్ల ఆసరా చెక్కును యానిమేటర్లు, గ్రూపు లీడర్లకు అందించారు. ఎమ్మెల్సీ పోతుల సునీత మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి నిరుపేదల పక్షపాతి అన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రతి ఒక్కరూ సంపూర్ణ మద్దతు తెలపాలని నొక్కి చెప్పారు. వెంకటేష్‌బాబు మాట్లాడుతూ సిఎం జగన్‌ను మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకొంటే సమాజంలో అసమానతలు తగ్గిపోతాయన్నారు. ముందుగా ప్రాంగణం వద్దకు చేరుకొన్న వెంకటేష్‌బాబుకు వైసిపి కార్యకర్తలు టపాసులు కాల్చి పెద్దఎత్తున పూలతో స్వాగతం పలికారు. వెంకటేష్‌బాబు ఐసిడిఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన పోషణ పక్వాడాను, వెలుగు డ్వాక్రా మహిళల స్టాల్స్‌ను పరిశీలించారు. సభ ప్రాంగణానికి వచ్చిన మహిళల మధ్య నుంచి అందరికీ పలకరిస్తూ ఇష్టాగోష్టిగా మాట్లాడారు. అక్కడ నుంచి నేరుగా స్టేజిపైకి ఎక్కి ఇక్కడ ఫ్యాన్లు పెట్టారు. మా సోదరీమణులకు ఫ్యాన్లు పెట్టకపోవడం వలన తీవ్ర ఉక్కపోతకు గురవుతున్నారని, అందుకు ముందుగా క్షమించాలని అన్నారు. ఏపిఎం బూదాటి శ్రీనివాసరావు స్టేజ్ మీదకు ఆహ్వానించే క్రమంలో తహశీల్దారు మహేశ్వరిని మల్లేశ్వరిగా పలికారు. జగనన్న బడుగు వికాసం కింద ముగ్గురికి నూతన ఆటోలను పంపిణీ చేశారు. లబ్ధిదారులకు ఎమ్మెల్యే బలరాం ఆటో తాళం చెవులను అందించి అభినందించారు. ఈ కార్యక్రమంలో మండల స్పెషల్ ఆఫీసర్ రాజదెబోరా, ఎంపిడిఒ ఎంవిఎస్ శర్మ, ఐసిడిఎస్ ఇన్‌ఛార్జి పిడి కె ఉమ, ఏసిడిపిఓ సుచిత్ర, నాయకులు సర్పంచ్ కె రమణ, పల్లపోలు శ్రీను, జైసన్‌బాబు, పులి శ్రీను, అందే కృష్ణ పాల్గొన్నారు.










