Sep 16,2023 20:50

లబ్ధిదారులకు మెగా చెక్కును అందజేస్తున్న ఫయాజ్‌బాషా

రాయచోటి : మహిళల ఆర్థిక ప్రగతే కాపు నేస్తం లక్ష్యమని మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా అన్నారు. శనివారం ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి కాకినాడ జిల్లా నిడిదవోలు బహిరంగ సభ నుంచి కంప్యూటర్‌ బటన్‌ నొక్కి నేరుగా వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం 4వ విడత లబ్ధి సాయం మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాల్లో మున్సిపల్‌ చైర్మన్‌ ఫయాజ్‌బాషా, మార్కెట్‌ యార్డ్‌ చైర్మన్‌ వెంకటేశ్వర్లు, జిల్లా బిసి వెల్ఫేర్‌ అధికారి సందప్ప, వివిధ శాఖల జిల్లా అధికారులు, లబ్ధిదారులు పాల్గొన్నారు. జిల్లాలోని 10,596 మంది లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలలోకి రూ.15.89 కోట్లను జమచేశారు. ఈ సందర్భంగా ్‌ ఫయాజ్‌బాషా మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డి దేశంలో ఎక్కడా లేని విధంగా మన రాష్ట్రంలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతోందన్నారు.మహిళలు వాళ్ళ కాళ్ళ మీద వాళ్లు సొంతంగా నిలబడుకోవాలనే మంచి ఆలోచనతో వైయస్సార్‌ కాపు నేస్తం పథకానికి శ్రీకారం చుట్టి ప్రతి ఏడాది 15 వేల రూపాయలు మహిళల ఖాతాలలో జమ చేయడం జరుగుతోందన్నారు. కాపు, బలిజ, తెలగ, ఒంటరి కులాల పేద మహిళల జీవనోపాధి అవకాశాలు, వారి ప్రమాణాలు మెరుగు పరచడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రభుత్వం అందిస్తున్న వివిధ సంక్షేమ పథకాలను అర్హులందరూ సద్వినియోగం చేసుకుని మరింత అభివ ద్ధి చెందాలన్నారు.ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం కాపు సామాజిక వర్గములోని కాపు, తెలగ, బలిజ, ఒంటరి కులములకు చెందిన 45 నుండి 60 ఏళ్ళ మధ్య వయస్సున్న పేద కాపు అక్క చెల్లమ్మలకు జీవనోపాధి అవకాశాలు, వారి జీవన ప్రమాణాలు పెంచే దిశగా 'వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం పథకాన్ని 4వ ఏడాది ముఖ్యమంత్రి ప్రారంభించారన్నారు. వైఎస్‌ఆర్‌ కాపు నేస్తం ద్వారా అర్హులైన బలిజ కాపు సామాజిక వర్గ మహిళలు 100 శాతం లబ్ధి పొందుతున్నారన్నారు. ఈ పథకం ద్వారా లబ్ధిదారులకు జీవనోపాధితో పాటు వారి జీవన ప్రమాణాలు కూడా మెరుగు పడుతున్నాయన్నారు. అర్హత ఉండి లబ్ధి చేకూరడంలో ఏమైనా సమస్యలు ఉంటే సంబందిత సచివాలయాలలో గానీ లేదా సంబందిత శాఖ జిల్లా అధికారి కార్యాలయంలో గానీ నేరుగా కలిసి తెలుపవచ్చన్నారు. ప్రభుత్వ ప్రత్యేక టోల్‌ ఫ్రీ నెంబరు:1902కు కాల్‌ చేసి తెలియజేయవచ్చన్నారు. కార్యక్ర మంలో జిల్లా బిసి సంక్షేమ శాఖ, మెప్మా, డిఆర్‌డిఎ అధికారులు, సంబందిత సంక్షేమ శాఖాధి కారులు, లబ్దిదారులయిన బలిజ, కాపు, ఒంటరి మహిళలు పాల్గొన్నారు. అనంతరం లబ్ధిదారులకు మెగా చెక్‌ను అందజేశారు.