ప్రజాశక్తి-పాడేరు: మహిళల ఆర్థిక అభివృద్దిపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. అమలాపురం పట్టణంలో వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీ పథకాన్ని వర్చువల్ విధానంలో సిఎం జగన్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్, శాసన సభ్యులు, ట్రైకార్ చైర్మన్, లబ్దిదా రులు రాష్ట్ర ముఖ్య మంత్రి వర్చువల్ విధానంలో ఇచ్చిన సందేశాన్ని తిలకించారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ మాట్లాడుతూ, ప్రభుత్వం మహిళలకు అనేక పథకాలు అందజేయడం జరుగుతుందన్నారు. అర్హత కలిగిన ప్రతి మహిళా పథకాలు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. జిల్లాలో సున్నా వడ్డీ పధకం నాలుగో విడత కింద 12 వేల 818 సంఘాల్లోని లక్షా 46 వేల 012 మంది సభ్యుల ఖాతాల్లో రూ.8.54 కోట్లు జమ చేస్తున్నట్లు చెప్పారు. ఇప్పటికే మూడు విడతలుగా అర్హత గల స్వయం సహాయక సంఘాలకు వై.ఎస్.ఆర్.సున్నా వడ్డీని నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో చేయడం జరిగిందన్నారు. ఇప్పటి వరకు రూ. 19.26 కోట్లు చెల్లించినట్లు వెల్లడించారు.
ఎమ్మెల్యే కే.భాగ్యలక్ష్మి మాట్లాడుతూ, మహిళాభివృద్ధికి సహకారం అందజేస్తున్న ముఖ్యమంత్రికి రుణపడి ఉండాలని కోరారు. లబ్దిదారులకు నమూనా చెక్కును అందజేశారు. అరకు నియోజక వర్గంలోని ఆరు మండలాల ఫరిధిలో 3,413 ఎస్.హెచ్.జి ల్లోని 39,664 మంది సభ్యుల ఖాతాల్లో రూ.1,39,06,470 లు జమ చేసినట్లు తెలిపారు. పాడేరు నియోజక వర్గంలో 2,970 ఎస్.హెచ్.జిల్లోని 36,059 మంది సభ్యుల ఖాతాల్లో రూ.1,85,24,061, రంపచోడవరం నియోజక వర్గంలో 6,435 ఎస్.హెచ్.జి ల్లోని 70,289 మంది సభ్యుల ఖాతాల్లో రూ.5,29,64,451లు జమ చేసినట్లు పేర్కొన్నారు. ప్రభుత్వ పథకాలను వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ట్రైకార్ చైర్మన్ శతక బుల్లిబాబు, డిఆర్డిఏ ప్రాజెక్ట్ డైరెక్టర్ వి.మురళి, తదితరులు పాల్గొన్నారు.










