Mar 07,2023 22:21

ప్రజాశక్తి - ఏలూరు టౌన్‌
               స్త్రీలకు పురుషులతో సమాన అవకాశాలు, స్త్రీల పట్ల అణచివేత, హింస లేని స్థితి కోసం అంతా కలిసికట్టుగా ముందుకు సాగాల్సిన అవసరం ఎంతో ఉందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి డి.రమాదేవి అన్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా స్థానిక సిఆర్‌ రెడ్డి ఫార్మసీ కాలేజీ, ఆదిత్య డిగ్రీ కళాశాలల్లో మంగళవారం నిర్వహించిన సభల్లో ఆమె ముఖ్యవక్తగా పాల్గొన్నారు. ఫార్మసీ కాలేజీలో ప్రిన్సిపల్‌ డాక్టర్‌ ఎ.రవీంద్రబాబు, ఆదిత్య డిగ్రీ కళాశాలలో ప్రిన్సిపల్‌ ఎంఎన్‌.శ్రీకాంత్‌ అధ్యక్షత వహించారు. ఆయా కళాశాలల్లో రమాదేవి మాట్లాడుతూ 1908లో మొదలైన మహిళా వివక్ష వ్యతిరేక ఉద్యమాల ఫలితంగా 1917లో మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ప్రకటించారన్నారు. 1975 నుండి ఐక్యరాజ్య సమితి అన్ని దేశాల్లో జరపాలని ప్రకటించిందన్నారు.
ఫార్మసీ కాలేజీలో మహిళా లెక్చరర్లను అభినందిస్తూ ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం తరపున సంఘ సంస్కర్త రాజారామ్మోహన్‌రారు జీవిత చరిత్ర పుస్తకాలు, మహనీయుల జయంతులు, వర్థంతులు తెలిపే విధంగా ముద్రించిన 2023 క్యాలెండర్‌ను రమాదేవి చేతుల మీదుగా అందజేశారు.
ఆయా సభల్లో రిటైర్డ్‌ హెడ్‌ మాస్టర్‌ పి.కస్తూరిబాయి, ఐద్వా నాయకులు పి.హైమావతి, జి.శారద, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి గుడిపాటి నరసింహారావు, సభ్యులు కూన కృష్ణారావు, శ్రామిక మహిళా నాయకులు వెంకటరమణ, ఎ.ఉషారాణి పాల్గొన్నారు.
స్త్రీలపై దాడులు, వేధింపాలు ఆపాలి
శ్రామిక మహిళా సదస్సు
మహిళలకు సమాన హక్కులు కల్పించాలని, మహిళలపై వేధింపులు, దాడులు అరికట్టాలని, చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలని శ్రామిక మహిళ సదస్సు డిమాండ్‌ చేసింది. శ్రామిక మహిళా సమన్వయ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఎన్‌ఆర్‌ పేట సిఐటియు జిల్లా కార్యాలయంలో అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా సదస్సు జరిగింది. ఈ సదస్సుకు ఐద్వా జిల్లా కన్వీనర్‌ పి.హైమావతి అధ్యక్షత వహించారు. శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ కె.విజయలక్ష్మి, మెప్మా ఆర్పీల జిల్లా కార్యదర్శి పి.వెంకటరమణ, ఆర్‌టిసి మహిళా ఉద్యోగుల సంఘం నాయకురాలు అరుణకుమారి, స్కూల్‌ స్వీపర్స్‌ యూనియన్‌ నాయకురాలు జె.స్వాతి, ఎవిఆర్‌ విజ్ఞాన కేంద్రం నాయకురాలు జి.శారద, ఆశా వర్కర్ల నాయకురాలు శివశంకరి మాట్లాడారు. నేటికీ మహిళలకు సమాన అవకాశాల్లేక అసమానతలు ఎదుర్కొంటున్నారని, రంగాల్లో వివక్ష, వేధింపులు పెరుగుతున్నాయని, చట్టసభల్లో మహిళలకు కనీసం 33శాతం రిజర్వేషన్ల కోసం అనేక ఉద్యమాలు జరిగినప్పటికీ చట్టాలు రూపొందించడం లేదన్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వ మతోన్మాద విధానాల వల్ల మహిళలపై మూఢనమ్మకాలు, ఆశాస్త్రీయ ఆలోచనలు పెరుగుతున్నాయన్నారు. సదస్సులో వివిధ సంఘాలకు చెందిన అంగన్వాడీ వర్కర్లు, ఆశాలు, స్కూల్‌ స్వీపర్లు, మెప్మా ఆర్‌పిలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. అనంతరం సిఐటియు జిల్లా కార్యాలయం నుండి కొత్త బస్టాండ్‌ వరకూ కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు.