తల్లీబిడ్డ క్షేమం.. ప్రశంసలు కురిపిస్తున్న మన్యవాసులు
ప్రజాశక్తి -సీలేరు: రక్తపోటుతో బాధపడుతున్న నిండు గర్భిణీ సుఖ ప్రసవానికి ధారకొండ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ హిమబిందు తీసుకున్న శ్రద్ధ, చొరవపై ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. తల్లీబిడ్డ ఇద్దరూ క్షేమంగా ఉండడం డాక్టర్ పెట్టిన ప్రాణభిక్షేనని అభినందనలు కురిపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే...
జీకే వీధి మండలం దారకొండ పిహెచ్‌సి చింతగుప్ప గ్రామంలో ఈనెల 11న వైద్యాధికారిణి హిమబిందు ప్రత్యేక వైద్య శిబిరాన్ని నిర్వహించారు. శిబిరంలో రోగులకు వైద్యపరీక్షలు నిర్వహించారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి ప్రజల ఆరోగ్యస్థితిగతులపై ఆరా తీసే క్రమంలో నెలల నిండి, రేపేమాపో ప్రసవం అన్నట్లున్న గర్భిణి గొల్లూరు కుమారిని గుర్తించారు. ఆమెకు వైద్య పరీక్షలు నిర్వహించి, అధికరక్తపోటు ఉండడంతో సురక్షిత ప్రసవానికి ఆసుపత్రిలో చేర్చించాలని కుటుంబసభ్యులకు సూచించారు. అదేరోజు తన వెంట పిహెచ్‌సికి తీసుకొచ్చారు. ప్రాథమిక చికిత్స అనంతరం అంబులెన్సులో చింతపల్లి ఏరియా హాస్పిటల్‌కు తరలించారు.అయితే మరుసటి రోజున, 12న, గర్భిణి కుమారి చింతపల్లి ఏరియా ఆసుపత్రి నుంచి ఎవరికి చెప్పకుండా తమ ఇంటికి వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న డాక్టర్ హిమబిందు ఈనెల 13న ఎఎన్‌ఎం, మత్స్యకొండ, సచివాలయ మహిళా పోలీసులను గర్భిణికి ఇంటికి పంపించి, మళ్లీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. గర్భిణి పరిస్థితి క్రిటికల్‌గా ఉండడంతో ఆమెకు కౌన్సెలింగ్ ఇచ్చి, ఆశాకార్యకర్త సీతమ్మ సాయంతో ధారకొండ నుంచి చింతపల్లి ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చి గైనకాలజిస్ట్ ఆదిత్య, కీర్తికి చూపించారు, అక్కడి నుంచి నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తీసుకెళ్లగా ఆసుపత్రిలో చేర్చించాలన్న అక్కడి వైద్యుల సూచనల మేరకు చేర్చించి డాక్టర్ హిమబిందు ధారకొండ వెళ్లిపోయారు.
అయితే నర్సీపట్నం ఏరియా ఆసుపత్రిలో గర్భిణీ ఆరోగ్య పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో విశాఖ కెజిహెచ్‌కు రిఫర్ చేసి, ప్రత్యేక అంబులెన్స్‌లో తరలించారు. కెజిహెచ్‌లో చేరిన తర్వాత గర్భిణి కుమారి ఆడ శిశువుకు జన్మనిచ్చింది. బాలింత కుమారి బిపి అదుపులోకి రాకపోవడంతో వారం రోజులపాటు ఆసుపత్రిలో ఉండాలని కెజిహెచ్ వైద్యులు సూచించారు.అక్కడ కూడా బాలింతగా ఆరోగ్యం విషమంగా ఉన్న కుమారి తాను ఇంటికి వెళ్లి పోతానని మారాం చేయడంతో ఆశాకార్యకర్త సీతమ్మ మళ్లీ డాక్టర్ హిమబిందుకు సమాచారమిచ్చారు. వెంటనే కెజిహెచ్ చేరుకున్న డాక్టర్ హిమబిందు బాలింతకుమారి, శిశువును పరామర్శించి, రిపోర్టుల పరిశీలించారు. ఆరోగ్య స్థితిగతులు మెరుగుపడే వరకు మరొక ఐదు రోజులు కేజిహెచ్‌లో ఉండాలని బాలింతరాలు కుమారిని డాక్టర్ హిమబిందు ఒప్పించారు. డాక్టర్ హిమబిందు ఇంతగా చొరవ తీసుకోకుంటే బాలింత కుమారి, ఆమె బిడ్డ దక్కేవారు కాదని స్థానికులు అంటున్నారు. ధారకొండ పిహెచ్‌సి వైద్యాధికారి డాక్టర్ హిమబిందు కృషి, చొరవను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. ధారకొండ పిహెచ్‌సి వైద్యాధికారిగా విధుల్లో చేరిన అనతికాలంలోనే మారుమూల గ్రామాల్లో సైతం వైద్యశిబిరాలను నిర్వహిస్తూ, గిరిజనానికిమెరుగైన వైద్యం అందించడంతోపాటు అత్యవసర పరిస్థితుల్లో ఆమె తీసుకుంటున్న చొరవ అభినందనీయమని అంటున్నారు.










