* పొన్నాడ వంతెనపై నుంచి దూకిన రాజేశ్వరి
ప్రజాశక్తి - శ్రీకాకుళం ప్రతినిధి: శ్రీకాకుళం మండలం ఖాజీపేటకు చెందిన మహిళా వాలంటీరు దూకి రాజేశ్వరి (22) మంగళవారం ఆత్మహత్య చేసుకుంది. ఎచ్చెర్ల మండలం పొన్నాడ వంతెనపై నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఖాజీపేట సచివాలయంలో వాలంటీర్‌గా పనిచేస్తున్న రాజేశ్వరి గ్రామానికి చెందిన ఎస్.శివకుమార్‌ను ఆరు నెలల కిందట ప్రేమించి వివాహం చేసుకుంది. శివకుమార్ స్థానికంగా కార్పెంటర్ పనులు చేస్తూ భార్య రాజేశ్వరి, తల్లిదండ్రులతో కలిసి జీవనం సాగిస్తున్నాడు. కుటుంబంలో కలహాలు తలెత్తడంతో కొద్దిరోజుల కిందటే భార్యభర్తలు గ్రామంలో వేరు కాపురం పెట్టారు. భర్త శివకుమార్ రోజూ మద్యం తాగి వస్తుండడంతో ఇంట్లో గొడవలు పడుతున్నారు. దీన్నే అలుసుగా తీసుకున్న రాజేశ్వరి అత్తమామలు శివకుమార్‌ను ఆమెపై వేధింపులకు ప్రోత్సహించేవారని స్థానికులు చెప్తున్నారు. చిన్నప్పుడే తల్లిదండ్రులను కోల్పోయిన రాజేశ్వరి అత్తింటి వారి వేధింపులు ఎక్కువ కావడంతో విసిగి వేశారి ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని గ్రామంలో అనుకుంటున్నారు. పొన్నాడ వంతెనపై నుంచి ఓ మహిళ దూకిందన్న సమాచారంతో ఒకటో పట్టణ పోలీసులు, అగ్నిమాపకశాఖ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు. వంతెన వద్ద మహిళ చున్నీ, టూత్ బ్రష్ గుర్తించారు. అగ్నిమాపక సిబ్బంది నీటిలో దిగి గాలింపు చర్యలు చేపట్టారు. శ్రీకాకుళం కునుకుపేట సమీపంలో మృతదేహం లభ్యమైంది. పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని ప్రభుత్వ సర్వజన ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.










