Nov 14,2021 07:28

  • 16న విజయవాడ ఎం.బి.వి.కె లో
  • కా|| మానికొండ సూర్యావతి శత జయంతి సభ

పదమూడు సంవత్సరాల వయసులోనే స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, ఆ తరువాత వామపక్ష భావాల వైపు ఆకర్షితులై ... ఆఖరి వరకు పీడిత ప్రజల విముక్తి కోసం అలుపెరగని కృషి చేసిన ఆదర్శ నేత కామ్రేడ్‌ మానికొండ సూర్యావతి. ఇది ఆమె శత జయంతి సంవత్సరం. కృష్ణా జిల్లా గన్నవరం తాలూకా ఇందుపల్లి గ్రామంలో 1921లో సంపన్న కుటుంబంలో సూర్యావతి జన్మించారు. ఆమె బాల్యం, చదువు అంతా కాటూరు గ్రామంలోని పినతండ్రి గారింట్లో జరిగింది.
     స్వాతంత్య్రోద్యమంలో మహిళలు పాల్గొనాలన్న గాంధీజీ పిలుపు ద్వారా చైతన్యవంతులైన స్త్రీలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వారిలో సూర్యావతి ఒకరు. పుచ్చలపల్లి సుందరయ్య, చండ్ర రాజేశ్వరరావు, కడియాల గోపాలరావు ప్రోద్భలంతో 1936లో తూర్పు కృష్ణాలో 56 మంది సభ్యులతో మహిళా సంఘం ఏర్పడింది. 1942లో కృష్ణా జిల్లా గరికపర్రులో జరిగిన మహాసభలో వల్లభనేని సీతామహాలక్ష్మి అధ్యక్షులుగా, సూర్యావతి కార్యదర్శిగా ఎన్నికయ్యారు. స్త్రీలకు విద్యా సౌకర్యాలు కల్పించాలని, పురుషులతో సమాన కూలి ఇవ్వాలని, ఆస్తిహక్కు కల్పించాలని, మరుగు దొడ్లు, ప్రసూతి ఆసుపత్రులు కట్టించాలని మహాసభలో తీర్మానాలు చేసి బ్రిటిష్‌ ప్రభుత్వానికి పంపారు. ఆ తరువాతి కాలంలో వాటి సాధనకు అనేక ఉద్యమాలు జరిగాయి.
 

                                          నాటి సాంఘిక పరిస్థితులు - ఎదురీత

స్త్రీలు అనేక రకాలుగా అణచివేతకు, వివక్షకు గురయ్యేవారు. చదువు, ఉద్యోగాలు పురుషులకు మాత్రమే. అనాగరిక ఫ్యూడల్‌ ఆచారాలు, సంప్రదాయాలు మహిళలను వెనక్కి నెట్టాయి. పైగా మహిళాభివృద్ధికి ఆటంకంగా ఉన్న సాంఘిక దురాచారాలను...భక్తి, మూఢవిశ్వాసాల ద్వారా మహిళలే ఒప్పుకుని ఆచరించేట్లుగా నాటి సామాజిక పరిస్థితులుండేవి.
మహిళా సంఘం విస్తరణకు కాలినడకన గ్రామ గ్రామాన పర్యటించారు. నేడున్న రవాణా సౌకర్యాలు ఆనాడు లేవు, స్త్రీలు గడప డాటి బయటకు రాకూడదనే సామాజిక కట్టుబాట్లు, ఆంక్షలు ఉన్న కాలంలో అనేక ఆటుపోట్లు ఎదుర్కొని, మొక్కవోని దీక్షతో మహిళా సంఘ నిర్మాణానికి కమ్యూనిస్టులు ఎంతగానో కషి చేశారు. సంఘం ఏర్పాటుకు పురుషుల నుండేగాక మహిళల నుండి కూడా ఛీత్కారాలను ఎదుర్కొన్నారు. 'ఆడవాళ్ళకు సంఘాలేంటి? మొగుడికి అన్నం వండి పెట్టరా? వెధవ ముండలకు పెళ్ళిళ్ళు చేస్తారా?' అంటూ మొఖం మీదే తలుపులు వేసేవారు. అవమానాలు, ఛీత్కారాలకు ఏమాత్రం వెరవకుండా సంఘ నిర్మాణంలో అనేక మంది కార్యకర్తలుగా ముందుకొచ్చారు. స్వాతంత్య్ర పోరాటంలోనూ, తెలంగాణ సాయుధ పోరాటంలో అమరులైన కుటుంబాల మహిళలు ఉద్యమంలో ప్రధాన పాత్ర వహించారు.
     సమాజంలో సగ భాగంగా ఉన్న మహిళలు చైతన్యం కాకుండా సమాజ మార్పు జరగదని భావించి తమ కుటుంబాల్లోని మహిళలకు తర్ఫీదునిచ్చి కార్యకర్తలుగా తయారు చేసిన ఘనత కమ్యూనిస్టులదే. ఆ స్ఫూర్తితోనే సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడుతూనే స్త్రీల సమాన హక్కుల కోసం ప్రభుత్వాలతో పోరాడి సాధించారు. స్త్రీ విద్య, భర్త ఆస్తిలో వాటా, సమాన పనికి సమాన వేతనం, బాల్య వివాహాల నిరోధక చట్టం, పుట్టింటి ఆస్తిలో మగపిల్లవాడితో సమాన హక్కు మహిళా సంఘాల ద్వారానే సాధించుకోగలిగాం.
 

                                                       ప్రజా ప్రతినిధిగా ...

కామ్రేడ్‌ సూర్యావతి 1950వ దశకంలోనే నందమూరు పంచాయితీ ప్రెసిడెంట్‌గా మూడు సార్లు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 1958లో ఎం.ఎల్‌.సి గా ఎన్నికై శాసన మండలిలో ప్రజా సమస్యలను ప్రస్తావించి వాటి పరిష్కారానికి కృషి చేశారు. 1987లో ఉంగుటూరు మండల అధ్యక్షురాలిగా ఎన్నికయ్యారు. గ్రామాల్లో మరుగుదొడ్ల సమస్య తీవ్రంగా ఉండేది. బుడమేరు వరద గ్రామాలను ముంపుకి గురి చేసేది. అలాంటి సమయాల్లో ప్రజలు పడుతున్న బాధలు చూసి ముంపు నివారణకు చర్యలు తీసుకోవటమేగాక దేశంలో ఎక్కడా లేని విధంగా 1,810 వ్యక్తిగత మరుగుదొడ్ల నిర్మాణం చేపట్టారు. తన అనారోగ్యాన్ని పక్కన పెట్టి మరీ హైద్రాబాద్‌కి అనేకమార్లు తిరిగి పట్టుదలతో నిధులు మంజూరు చేయించారు. పదవిని స్వప్రయోజనాలకు కాకుండా ప్రజా సమస్యల పరిష్కారానికి అలుపెరగని కషి చేశారు.
 

                                        నిర్బంధాలను సైతం లెక్కచేయక ...

తెలంగాణ సాయుధ పోరాటం సందర్భంగానూ, 1964లో చైనాలో యుద్ధం జరిగినప్పుడు చంటి పిల్లల తల్లిగా ఉన్న సూర్యావతిని పిల్లల నుండి విడదీసి భర్తతో పాటు జైలులో నిర్బంధించారు. మహిళల్లో అభ్యుదయ భావాల ప్రచారం కోసం ప్రారంభించిన 'ఆంధ్ర వనిత' పత్రికను నిషేధించినప్పుడు ఆందోళనకు దిగిన వారిపై లాఠీచార్జి చేసి సూర్యావతి, అన్నే అనసూయ, మోటూరు ఉదయం, డాక్టర్‌ అచ్చమాంబ తదితరు నేతలతో సహా 70 మంది మహిళలను నందిగామ జైలులో పెట్టారు. నిర్బంధాన్ని సైతం వారు ధైర్యంగా ఎదుర్కొన్నారు.
     1947లో ఆంధ్రప్రదేశ్‌ మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికై రాష్ట్రమంతటా అనేక జిల్లాల్లో సంఘ నిర్మాణానికి విస్తృతంగా కృషి చేశారు సూర్యావతి. ఆఖరి శ్వాస వరకూ రాష్ట్ర ఉపాధ్యక్షులుగా కొనసాగారు. 1942 నుండి 1988 వరకు కష్ణా జిల్లా కార్యదర్శిగా, 1988 నుండి 1990 వరకూ జిల్లా అధ్యక్షురాలిగా సుదీర్ఘకాలం పనిచేశారు. రాష్ట్రంలో మహిళలపై హింస పెరుగుతోందని, కుటుంబ సమస్యలతో మహిళలు పడుతున్న బాధలు గమనించి 1990లో కృష్ణా జిల్లా మహిళా న్యాయ సలహా కేంద్రాన్ని స్థాపించటంలో ఆమె పాత్ర మరువలేనిది.
 

                                              నేనెరిగిన సూర్యావతి...

1977లో తిరువూరులో జరిగిన మహిళల జనరల్‌ బాడీ సమావేశానికి సూర్యావతి హాజరయ్యారు. అప్పటి నుండి 1993 జూలై 4న చనిపోయే వరకూ మహిళా ఉద్యమంలో ఆమెతో కలిసి పని చేసే సదవకాశం నాకు లభించింది. ఆమె నిరాడంబరత, క్రమశిక్షణ, అంకిత భావం, త్యాగశీలత, నమ్మిన సిద్ధాంతం పట్ల నిబద్ధత, నిర్మాణ సూత్రాలకు కట్టుబడిన తీరు, కార్యకర్తల పట్ల ప్రత్యేక శ్రద్ధ, వారి సాధక బాధలు శ్రద్ధగా విని పరిష్కార మార్గాలు చూపిన వైనం...వంటివన్నీ ఆమె నుండి నేర్చుకోవాల్సిన అంశాలు. కార్యకర్తల్లో ఉన్న పొరపాటు ధోరణులను సరిదిద్దుకునేట్లుగా సున్నితంగా చెప్పేవారు. సంపన్న కుటుంబంలో పుట్టినా చాలా సాదాసీదాగా ఉండేవారు. 1993 జులై 4న హైదరాబాద్‌లో జరిగిన 41 ప్రజా సంఘాల సదస్సుకి కామ్రేడ్‌ సూర్యావతి, జోయా గారు, నేను వెళ్లాం. కుమార్తె వాణి కొన్న బెంగాలీ కాటన్‌ చీర కట్టుకున్నారామె. చీరకు జరీ పోగు ఉందని చాలా ఫీలయ్యారు. 15 సంవత్సరాల వయస్సులోనే చెవిదిద్దులు పెట్టుకోవటం మానేశానని చెప్పారు. కారణమడిగితే మహిళా సంఘం కార్యక్రమానికి గ్రామం వెళితే తను పెట్టుకున్న చెవిదిద్దులు బాగున్నాయంటూ మహిళల నుండి వచ్చిన కామెంట్‌ నాయకుల దృష్టికి వెళ్ళింది. మీరు నగల ప్రచారానికి వెళుతున్నారా? అనే విమర్శకు గురయ్యానని...నాటి నుండి నగలు ధరించటం మానివేశానని... చెప్పారు. 'పరాయి పాలనకు వ్యతిరేకంగా స్వాతంత్య్రం కోసం పోరాడాం. ఆ స్వాతంత్య్రం పేరుతో అధికారం లోకి వచ్చిన కాంగ్రెస్‌ మన దేశ సంపదను పరాయి ప్రభుత్వాలకు తాకట్టు పెడుతోంది. ఈ విధానాలకు వ్యతిరేకంగా అన్ని తరగతుల ప్రజలు మరో సంగ్రామాన్ని నిర్వహించాలి' అని హైదరాబాద్‌ సదస్సులో పిలుపునిచ్చారు. అదే ఆమె చివరి ప్రసంగం. నేడు కేంద్రంలో అధికారంలో వున్న బిజెపి అంతకన్నా వేగంగా ప్రజల సంపదను దేశ విదేశీ కార్పొరేట్లకు దోచిపెడుతోంది. ఆ దోపిడీని అడ్డుకునేందుకు పోరు సల్పడమే కా|| సూర్యావతికి మనం ఇచ్చే నివాళి.
 

/ వ్యాసకర్త - సిపియం రాష్ట్ర కమిటీ సభ్యులు /

కె. స్వరూపరాణి