ప్రజాశక్తి- తగరపువలస : మహిళా సంక్షేమానికి తమ ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నట్లు భీమిలి ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు అన్నారు. చిట్టివలస ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో మంగళవారం జివిఎంసి ఒకటో వార్డులో ఉన్న 2,668 మంది పొదుపు సంఘాల సభ్యులకు ఆసరా పథకం కింద విడుదలైన రూ.కోటి 95 లక్షల చెక్కును ఆయన అందజేశారు. సిఎం జగన్మోహన్‌రెడ్డి చిత్ర పటానికి పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ, గతంలో ఎన్నడూ లేనివిధంగా మహిళలకు తమ ప్రభుత్వం అన్ని రంగాల్లోనూ అధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు వివరించారు. గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా అర్హులందరికీ ఇంటి ముంగిటకే సంక్షేమ పథకాలు అందిస్తున్నామన్నారు. భీమిలి జోన్ పరిధిలో ఇప్పటి వరకు రూ.180 కోట్లతో 35 అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. రూ.154 కోట్ల విలువ గల 23 రకాల సంక్షేమ పథకాలు అందించినట్లు వివరించారు. వార్డు కార్పొరేటర్ అక్కర మాని పద్మ, కో-ఆప్షన్ సభ్యులు కొప్పల ప్రభావతి, జెడ్పీటీసీ సభ్యులు గాడు వెంకటప్పడు, ఎఎంసి చైర్మన్ యలమంచిలి సూర్యనారాయణ, సింగనబంద సర్పంచ్ గాడు వెంకట నారాయణ, జోనల్ కమిషనర్ బొడ్డేపల్లి రాము, యుసిడి ఎపిడి ఎల్ రాము, వైసిపి వార్డు అధ్యక్షులు జగుపిళ్ళ ప్రసాద్, మాజీ కౌన్సిలర్లు ఉప్పాడ నాగేశ్వరరావు, జివి.రమణ, కొప్పల రమేష్ తదితరులు పాల్గొన్నారు.










