Nov 01,2022 00:00

ర్యాలీ చేపడుతున్న సంఘం మహిళా నాయకులు ర్యాలీ చేపడుతున్న సంఘం మహిళా నాయకులు

ప్రజాశక్తి- అరకులోయ :అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్‌ చేస్తూ అరకులోయ మండల కేంద్రంలోని నాలుగు రోడ్ల జంక్షన్‌లో గిరిజన మహిళా సంఘం, ఐద్వా ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, మానవహారం నిర్వహించారు. డుంబ్రిగూడ మండలం కొల్లాపూట్‌ పంచాయతీ నందివలస గ్రామంలో ఓ యువతిని రామచందర్‌ అత్యాచారం చేసి హత్య చేశాడని, ఇతనిపై చట్టపరంగా శిక్షించాలని సంఘం మహిళా నేతలు డిమాండ్‌ చేశారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతంలో ఇటువంటి విషపూరిత సంఘటనలు జరగడం బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు.గిరిజన మహిళలకు పూర్తిస్థాయిలో రక్షణ కల్పించాలని, నిర్మానుష ప్రాంతాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలని వారు డిమాండ్‌ చేశారు. నిర్భయ, దిశ చట్టం కింద కేసు నమోదు చేయాలని చట్ట ప్రకారం కుటుంబానికి నష్టపరిహారం ఇవ్వాలన్నారు. ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని మహిళ సంఘం ప్రతినిధులు డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో గిరిజన మహిళ సంఘం ప్రతినిధులు హైమావతి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యులు వి.వి. జయ, జాయింట్‌ సెక్రటరీ గెమ్మెలి సన్యాసమ్మ, కుటుంబ సభ్యులు సుందరమ్మ, కోకిల కోకిల, రమేష్‌, జోషి, విజయ శెట్టి సౌజన్య తదితరులు పాల్గొన్నారు.