* జెడ్‌పి చైర్‌పర్సన్ పి.విజయ
ప్రజాశక్తి - కవిటి: మహిళా సాధికారితపై ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేక దృష్టిసారించి మహిళల రక్షణ, అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నారని జిల్లాపరిషత్ చైర్‌పర్సన్ పిరియా విజయ తెలిపారు. తన నివాసంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు. మహిళల భద్రత కోసం దిశ యాప్, పోలీస్‌స్టేషన్లు ప్రవేశపెట్టినట్టు గుర్తు చేశారు. దిశ యాప్ 1.7 కోట్ల రిజిస్ట్రేషన్లు నమోదు చేసిందని, ఈ యాప్ ద్వారా 30 వేల మందికి పైగా అమ్మాయిలకు రక్షణ కల్పించినట్లు తెలిపారు. అమ్మఒడి, జగనన్న విద్యా కానుక తదితర పథకాలతో పాటు బడుగు బలహీన వర్గాలకు నాణ్యమైన విద్యను అందిస్తున్నట్లు చెప్పారు. అర్హులైన ప్రతి విద్యార్థికి పూర్తి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ను అందిస్తూ వసతి దీవెన, విద్యా దీవెన తదితర పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. గ్రామ, వార్డు వాలంటీర్లలో 53 శాతం, గ్రామ, వార్డు సచివాలయాల్లో 50 శాతం కంటే ఎక్కువ మంది మహిళలకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. సున్నా వడ్డీ పథకం కింద గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో కోటి ఎస్‌హెచ్‌జి మహిళలకు రూ.3,615 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. కాపు నేస్తం, వైఎస్‌ఆర్ పెన్షన్ కానుక, వైఎస్‌ఆర్ కళ్యాణమస్తు, షాదీ తోఫా వంటి పథకాలతో వైసిపి ప్రభుత్వం మహిళలకు పెద్దపీట వేస్తోందన్నారు. రాష్ట్రంలో సంక్షేమ, అభివృద్ధి పాలన చూసి పవన్ కళ్యాణ్, చంద్రబాబు ఓర్వలేక వాలంటీర్ వ్యవస్థపై, ప్రభుత్వంపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వైసిపి కార్యకర్తలు ప్రజలతో మమేకమై 2024లో మళ్లీ వైసిపి అధికారంలోకి వచ్చేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.










