Aug 11,2023 21:06

స్వయం సహాయక సంఘాల సభ్యులకు మెగా చెక్‌ను అందజేస్తున్న అధికారులు

కడప: మహిళా సాధికారతే ధ్యేయంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల మహిళల్లో ఆర్థిక భరోసాను నింపేందుకే వైఎస్‌ఆర్‌ సున్నా' వడ్డీ పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని రాష్ట్ర ప్రభుత్వ ఉద్యాన సలహాదారు పి.శివప్రసాద్‌రెడ్డి అన్నారు. శుక్రవారం అమలాపురం బహిరంగ సభ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా 2022-23 సంవత్సరానికి సంబంధించి 4వ ఏడాది స్వయం సహాయక సంఘాల మహిళలకు వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం లబ్ది మొత్తాన్ని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి మహిళల బ్యాంకు ఖాతాల్లో జమ చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్‌ విసి హాలు నుండి రాష్ట్ర ఉద్యాన సలహాదారు పి.శివ ప్రసాద్‌రెడ్డి, మిషన్‌ శక్తి స్టేట్‌ ఎక్జిక్యూటివ్‌ మెంబర్‌ మూలే సరస్వతి, మెమ్మా పీడీ విశ్వ సురేష్‌, డిఆర్‌డిఎ పీడీ ఆనంద్‌నాయక్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వయం సహాయక సంఘాల మహిళల ఆర్ధిక ప్రగతి కోసం సున్నా వడ్డీ లబ్ధి మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసి ప్రభుత్వం వారికి అండగా నిలవడం గర్వించదగ్గ విషయమన్నారు. ముఖ్యమంత్రి తన సుధీర్ఘ పాదయాత్రలో చేసిన హామీలన్నీ నెరవేరుతున్నాయన్నారు. మహిళ బాగుంటేనే ఇల్లు బాగుంటుందని తద్వారా గ్రామం, రాష్ట్రం, సమాజం బాగుంటుందని నమ్మి ముఖ్యమంత్రి ఆలోచన చేసి 90 శాతం పథకాలు మహిళల పేరిట అమలు చేస్తున్నారన్నారు. గ్రూపులో ఉన్న మహిళా సభ్యులు చిన్న చిన్న వ్యాపారం చేస్తూ పెద్ద, పెద్ద వ్యాపారవేత్తలుగా ఎదగాలన్నారు. బ్యాంకుల నుండి రుణాలు తీసుకుని సకాలంలో చెల్లించిన పొదుపు సంఘాల్లోని పేదింటి అక్కచెల్లెమ్మల మీద ఏ మాత్రం వడ్డీ భారం పడకుండా, ప్రభుత్వమే వారి తరఫున వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద ఆ భారాన్ని భరిస్తుందన్నారు. ఎంత వడ్డీ అవుతుందో అంత మొత్తాన్ని నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తోందన్నారు. వివిధ పథకాల ద్వారా పొందిన లబ్ధితో మహిళలు చిన్న, చిన్న వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా నిలదొక్కుకునేందుకు ప్రభుత్వం పలు చర్యలు తీసుకుందన్నారు. అనంతరం 2022-23 సంవత్సరానికి సంబంధించి వైఎస్సార్‌ సున్నా వడ్డీ పథకం కింద జిల్లాలోని పట్టణ, గ్రామీణ పరిధిలో 37,576 (పట్టణంలో11,849 గ్రామీణం 25727) సంఘాలోని 399795 మంది సభ్యులకు రూ.57.48 కోట్ల మెగా చెక్‌ను లబ్దిదారులకు అందజేశారు. కార్యక్రమంలో సంబంధిత అధికారులు, గ్రామీణ, పట్టణ స్వయం సహాయక సంఘ మహిళలు పాల్గొన్నారు.