Aug 27,2023 23:21

పొందూరు : మాట్లాడుతున్న రవికుమార్‌

ప్రజాశక్తి- పొందూరు: రాష్ట్రంలో మహిళా సాధికారత, అభివృద్ధి తెలుగుదేశం ప్రభుత్వంతోనే సాధ్యమని టిడిపి జిల్లా అధ్యక్షుడు కూన రవికుమార్‌ అన్నారు. మండలంలోని తాడివలసలో సర్పంచ్‌ తమ్మినేని మణెమ్మ, మాజీ ఎంపిపి కూన ప్రమీల ఆధ్వర్యాన టిడిపి మహిళ మహాశక్తి చైతన్య యాత్ర కార్యక్రమం ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళల కోసం డ్వాక్రా సంఘాలను ఏర్పాటు చేసి వారి అభ్యున్నతికి పాటుపడినది టిడిపి అని అన్నారు. మహిళలను శక్తిమంతులను చేసేందుకు చంద్రబాబునాయుడు ఆరు పథకాలను ప్రకటించారని పేర్కొన్నారు. ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయగల శక్తి మహిళలకే ఉందని తెలిపారు. అనంతరం ఇంటింటికీ వెళ్లి మహిళలకు టిడిపి ప్రభుత్వం ప్రకటించిన పథకాలపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో టిడిపి మండల అధ్యక్షుడు చిగిలిపల్లి రామ్మోహన్‌, నాయకులు సీపాన శ్రీరంగనాయకులు, చింతాడ కృష్ణవాసుదేవరావు, బలగ శంకరభాస్కరరావు, గాడు నారాయణరావు, బాడాన శేషగిరినాయుడు, బి.సత్యం, వండాన మురళి, పి.వేణుగోపాలరావు, భాస్కరరావు, లక్ష్మణరావు, ఎంపిటిసిలు బాడాన హారిక, ఎ.వాణి, మాజీ సర్పంచ్‌లు ఎ.విజయలక్ష్మి, కూన సుధ, బుజ్జి, అప్పలనాయుడు పాల్గొన్నారు.
పలాస : టిడిపి పూర్వ వైభవానికి మహిళా శక్తి ప్రధానమైనదని టిడిపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గౌతు శిరీష అన్నారు. మండలంలోని గురుదాస్‌పు రంలో ఆదివారం మహాశక్తి నిర్వహించారు. ముందుగా గ్రామ పురవీధుల్లో మహిళలతో ఆమె పర్యటించి టిడిపి ప్రజలకు అందించిన సంక్షేమ పథకాలను మహిళలకు వివరించారు. సర్పంచ్‌ కుత్తుం రూపవతి, టిడిపి జిల్లా ప్రధాన కార్యదర్శి పి.విఠల్‌రావు, మండల ప్రధాన కార్యదర్శి దువ్వాడ సంతోష్‌ కుమార్‌ పాల్గొన్నారు.