ప్రజాశక్తి-కాకినాడ మహిళా సాధికారత కోసం అనేక సంక్షేమ పథకాలను ప్రభుత్వం సమర్థంగా అమలు చేస్తోందని కలెక్టర్ డాక్టర్ కృతికా శుక్లా అన్నారు. వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ నాలుగో విడత నగదు పంపిణీ కార్యక్రమం శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వివేకానంద సమావేశ మందిరంలో జరిగింది. డాక్టర్ బిఆర్.అంబేద్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి కార్యక్రమంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బటన్ నొక్కి ప్రారంభించిన కార్యక్రమాన్ని మహిళాలు తిలకించేలా జిల్లాలో ఏర్పాట్లు చేశారు. ఆర్థిక, సామాజిక రంగాల్లో మహిళలు అభివద్ధి చెందడానికి ప్రభుత్వం కృషి చేస్తోందన్నారు. మహిళల పక్షపాత ప్రభుత్వంగా ప్రత్యేక ముద్ర వేసుకుందన్నారు. మహిళలు అన్ని రంగాల్లో సంతోషంగా ఎదగడానికి ప్రభుత్వం వేదికగా నిలుస్తుం దన్నారు. ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను సద్వినియోగం చేసుకొని మహిళలు ముందుకు సాగాల న్నారు. జిల్లాలోని మహిళలు అభివద్ధి వైపు అడుగులు వేయాలన్నారు. జిల్లాలోని 43,713 పొదుపు సంఘాల్లోని మహిళలకు రూ.63.52 కోట్ల నగదును ప్రభుత్వం విడుదల చేసిందన్నారు. అనంతరం మహిళలకు రూ.63.52 కోట్ల చెక్కును కలెక్టర్ అందచేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అయ్యారక కార్పొరేషన్ చైర్ పర్సన్ ఆవాల రాజేశ్వరి, కూడా చైర్ పర్సన్ రాగిరెడ్డి చంద్రకళ దీప్తి, డిఆర్‌డిఎ పీడీ కె.శ్రీరమణి పాల్గొన్నారు.










