ప్రజాశక్తి - కైకలూరు
అంబేద్కర్ మాటలను స్ఫూర్తిగా తీసుకున్న సిఎం జగన్ మహిళలు అభివృద్ధి చెందితేనే, సమాజం అభివృద్ధి చెందుతుందని, మహిళా సాధికారత పెంపొందించే దిశగా పొదుపు సంఘ మహిళలకు వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం అందిస్తున్నారని ఎంఎల్‌ఎ దూలం నాగేశ్వరరావు తెలిపారు. ఇన్ని మంచి కార్యక్రమాలు చేస్తున్న జగన్‌ని ప్రతిఒక్కరూ ఆశీర్వదించాలన్నారు. శుక్రవారం కైకలూరులోని వెలుగు కార్యాలయంలో నియోజకవర్గంలోని పొదుపు సంఘాల మహిళలకు నాల్గవ విడతగా వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ రాయితీ అందించు కార్యక్రమంలో ఎంఎల్‌సి వెంకటరమణతో కలసి పాల్గొన్నారు. అమలాపురంలో జరిగిన వైఎస్‌ఆర్ సున్నా వడ్డీ పథకం ప్రత్యక్ష ప్రసారం వీక్షించినానంతరం ఎంఎల్‌ఎ డిఎన్‌ఆర్, ఎంఎల్‌సి జయమంగళ వెంకటరమణలు రూ.7.22 లక్షల చెక్‌ను పంపిణీ చేశారు. అనంతరం ప్రజా ప్రతినిధులు, ముఖ్యమంత్రి జగన్ చిత్ర పటానికి క్షీరాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపిపిలు అడవి వెంకట కృష్ణమోహన్, ఉమామహేశ్వరరావు, రాష్ట్ర క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టర్ నంబూరి శ్రీదేవి, మండల వ్యవసాయ మార్కెట్ అధ్యక్షురాలు దండే పుష్పలత, శివాజీ, ఎపిఎంలు, సిసిలు, వెలుగు కార్యాలయ సిబ్బంది, పొదుపు సంఘాల మహిళలు పాల్గొన్నారు.










