రాయచోటి టౌన్ మహిళలపై దాడులు, అత్యాచారాలు, హత్యలు రోజురోజుకు తీవ్రమవడానికి కేంద్ర. రాష్ట్ర ప్రభుత్వాలు మహిళా రక్షణ చట్టాలను పటిష్టంగా అమలుచేయడంలో నిర్లక్ష్యమే కారణమని ఐద్వా రాష్ట్ర కోశాధికారి వి. సావిత్రమ్మ పేర్కొన్నారు. ఐద్వా ఆధ్వర్యంలో 'హింసపై మహిళల పోరుయాత్ర పేరుతో రాష్ట్ర వ్యాపితంగా మహిళలను జాగతి కోసం నిర్వహిస్తున్న బస్సు జాతా రెండో రోజు శనివారం పట్టణంలోని కెజిబిఎస్ మోడల్ స్కూల్, బస్టాండ్ సర్కిల్‌కు చేరుకుంది. ముందుగా మహిళలపై జరుగుతున్న అకృత్యాలను ప్రజల కళ్లకుగట్టినట్లు ప్రజానాట్య మండలి బృందం ప్రదర్శన నిర్వహించింది. ఈ ప్రదర్శన పట్టణ వాసులను ఎంతగానో ఆలరించింది. వారు ఆలపించిన పాటలు, నృత్యాలు పట్టణ వాసులను ఆలోచింపజేశాయి. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర కోశాధికారి మాట్లాడుతూ ప్రతిష్ట పెంచిన మహిళల రెజ్లర్లు గోల్డ్ మెడల్ తెస్తే వారిపై లైంగింక వేధింపులు అధికమయ్యాయని పేర్కొన్నారు. మణిపూర్‌లో హింసాకాండ, యూనివర్శిటీలలో లైంగిక వేధింపులకు ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థిను ఎంతో మంది ఉన్నారని చెప్పారు. రోజురోజుకూ వందలాది సంఖ్యలో మహిళలు అదృశ్యమైన కేసులు వెలుగులోకి వస్తున్నాయని తెలిపారు. నిర్భయ, దిశ వంటి చట్టాలు పేరుకే అని ఎక్కడా అమలు కాడం లేదని వాపోయారు. మహిళా రిజర్వేషన్ల అమలులో జాప్యం వీడాలని పేర్కొన్నారు. మహిళలు తమ సమస్యల పట్ల ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఐద్వా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డి. రమాదేవి మాట్లాడుతూ ఆగస్టు 8న మహిళా సమస్యలపై విజయవాడలో నిర్వహించే బహిరంగ సభకు పెద్ద ఎత్తున మహిళలు హాజరై జయప్రదం చేయాలని కోరారు. బస్సు ప్రచార జాతా కార్యక్రమాన్ని సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ. రామాంజులు ప్రారంభించారు. కార్యక్రమంలో ఐద్వా రాష్ట్ర నాయకులు దిల్షాద్, రామాంజులమ్మ, ఐద్వా జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, బంగారుపాప, ఖాజాబీ, రెడ్డమ్మ, నిర్మల, మాధవి, కరుణ, లావణ్య, పద్మజ, ప్రజానాట్యమండలి కార్యదర్శి వెంకటాచలపతి శ్రీరాములు పాల్గొన్నారు.










