ప్రజాశక్తి -ములగాడ : చట్టసభలో మహిళా రిజర్వేషన్ల బిల్లును ఆమోదించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) మల్కాపురంజోన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.మమత, ఆర్.విమల డిమాండ్‌చేశారు. నెల్లూరులో ఈ నెల 24 నుంచి 26వ తేదీ వరకు జరగనున్న ఐద్వా 15వ రాష్ట్ర మహాసభల నేపథ్యంలో 58వ వార్డు గుల్లలపాలెం కమిటీ ఆధ్వర్యాన సీనియర్ నాయకులు పి.వరలక్ష్మి గురువారం పతాకావిష్కరణ చేశారు. ఈ సందర్భంగా బి.మమత, ఆర్.విమల మాట్లాడుతూ, నేటికీ మహిళా బిల్లు ఆమోదించక పోవడమంటే రాజ్యాంగ హక్కులపై దాడి స్పష్టమవుతోందన్నారు. ఎన్ని చట్టాలు తెచ్చినా మహిళలపై హింస ఆగడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. ప్రభుత్వాలు సరైన చర్యలు తీసుకోకపోవడం వల్ల మహిళలకు రక్షణ కరువైందన్నారు. నిత్యావసర సరుకుల ధరలను నియంత్రించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మల, పోలమ్మ, కృష్ణవేణి, ఈశ్వరమ్మ తదితరులు పాలొన్నారు.










