Aug 20,2023 23:34

మహిళా రెసిడెంట్‌ వైద్యులతో మాట్లాడుతున్న సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌

ప్రజాశక్తి - గుంటూరు జిల్లాప్రతినిధి : గురటూరు ప్రభుత్వ సమగ్ర వైద్యశాల (జిజిహెచ్‌)లో మహిళా సీనియర్‌ రెసిడెంట్స్‌ వసతి గృహాన్ని సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ ఆదివారం పరిశీలించారు. హాస్టల్‌కు రెండేళ్ల నుంచి మహిళా పర్యవేక్షణ అధికారి లేరని, ప్రైవేటు వ్యక్తులే పర్యవేక్షిస్తుడడంతో సమస్యలను ఎవరికి చెప్పాలో అర్థం కావడం లేదని రెసిడెంట్‌ వైద్యులు అన్నారు. ఐదంస్తుల భవనంలో 40 రూములు ఉన్నాయని, ఒక్కో గదికి ముగ్గురు చొప్పున 120 మంది ఉన్నామని తెలిపారు. మందులను భద్రపర్చడానికి ఇక్కడ గదిని కేటాయించగా వాటి కోసం పురుషులూ వస్తుంటారని, ఆ సందర్భంలో తకు ఇబ్బందిగా ఉంటుందని వివరించారు. మందులను మరోచోటుకు తరలించాలని కోరారు. రాత్రివేళల్లో విధులకు వెళ్లి వచ్చే క్రమంలో పోకిరీలు సంచరిస్తుండడం వల్ల భయంగా ఉందన్నారు. సూపరింటెండెంట్‌ మాట్లా డుతూ హాస్టల్‌ వద్ద పగలు ఒకర్ని, రాత్రివేళళ్లో ఒక మహిళ, ఒక పురుష సెక్యూరిటీని నియమించాలని ఆదేశిం చారు. ఫ్లోర్‌కు ఒకరు చొప్పున పారిశుధ్య కార్మికుల్ని నియమించాలన్నారు. హాస్టల్‌ పర్యవేక్షణాధికారిగా అనాటమి విభాగం హెచ్‌ఒడి డాక్టర్‌ సావిత్రిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశామన్నారు. మహిళా రెసిడెంట్లకు పీజీ విద్యార్థుల హాస్టల్‌ నుండి భోజనం తేవడాన్ని తప్పుబట్టారు. జనరేటర్‌కు మరమ్మతు చేయించాలని, గదులకు ఏసీలు పెట్టుకోవడానికి ఉన్న అవకాశాన్ని పరిశీలించాలని ఆదేశించారు. ఆయనవెంట సివిల్‌ సర్జన్‌ ఆర్‌ఎంఒ డాక్టర్‌ సతీష్‌ కుమార్‌, నర్సింగ్‌ సూపరింటెండెంట్‌ ఆశా సజని ఉన్నారు.