
ప్రజాశక్తి- అనకాపల్లి
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన రెజ్లింగ్ ఫెడరేషన్ చైర్మన్, బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ జిల్లా కార్యదర్శులు జి.ఫణీంద్ర కుమార్, వియ్యపు రాజు డిమాండ్ చేశారు. ఈ విషయంపై గత 20 రోజుల నుంచి ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద మహిళా రెజ్లర్లు చేస్తున్న ఆందోళనకు మద్దతుగా ఆయా సంఘాల ఆధ్వర్యాన శనివారం అనకాపల్లి నాలుగు రోడ్ల జంక్షన్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రెజ్లింగ్‌లో పతకాలు సాధించి భారత దేశ ప్రతిష్టను ఇనుమడింపజేసిన భారత మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడడం దారుణమన్నారు. 20 రోజుల నుంచి ఢిల్లీలో మహిళా రెజ్లర్ల నిరసన చేపట్టినా ఇంతవరకూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. దేశ భక్తి గురించి గొంతు చించుకునే బిజెపి దేశ ప్రతిష్టను పెంచిన మహిళా రిజర్లపై ఈ విధంగా వ్యవహరించడం దారుణమన్నారు. ఇప్పటికైనా మోడీ స్పందించి బ్రిజ్ భూషణ్ చరణ్ సింగ్‌పై చర్యలు తీసుకోకుంటే దేశ వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎఐఎస్‌ఎఫ్, ఎఐవైఎఫ్ నాయకులు, విద్యార్థులు పాల్గొన్నారు.