
ప్రజాశక్తి-అనకాపల్లి
భారత స్టార్ మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించిన బిజెపి ఎంపీ, రెల్లింగ్ ఫెడరేషన్ అధ్యక్షులు బ్రిజ్ భూషణ్‌ను, ఓ జూనియర్ అథ్లెటిక్స్ మహిళా కోచ్‌ను లైంగికంగా వేధించిన హర్యానా మంత్రి సందీప్ సింగ్‌ను వెంటనే అరెస్టు చేయాలని, వారిని పదవుల నుండి బర్తరఫ్ చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) డిమాండ్ చేసింది. ఈ మేరకు ఢిల్లీలో మహిళా రెజ్లర్లు చేస్తున్న నిరసన కార్యక్రమానికి మద్దతుగా శుక్రవారం ఐద్వా నాయకులు స్థానిక అనకాపల్లి ఆర్టీసీ కాంప్లెక్స్‌లో సంతకాల సేకరణ చేపట్టారు. ఈ సందర్భంగా ఐద్వా రాష్ట్ర అధ్యక్షురాలు బి.ప్రభావతి మాట్లాడుతూ లైంగిక వేధింపులపై మహిళా మల్లయోధులు 2023 జనవరిలో ఢిల్లీలో నిరసన తెలియజేశారని, నాడు దర్యాప్తు చేసి న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన కేంద్రం ఆ దిశగా చర్యలు చేపట్టలేదని పేర్కొన్నారు. సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనే వరకు ఢిల్లీ పోలీసులు ఎఫ్‌ఐఆర్ నమోదు చేయకపోవడం దారుణమన్నారు. బ్రిజ్ భూషణ్ అధికార బిజెపి ఎంపీ కావడంతో నిందితులను రక్షిస్తుందని విమర్శించారు. ఇదంతా చాలదన్నట్టు బ్రిజ్ భూషణ్ రెజ్లర్లను భయపెట్టి బెదిరించారని తెలిపారు. ఆయన వల్ల తమ ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని రెజ్లర్లు భయపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో వెంటనే బిజెపి ఎంపీ బ్రిజ్ భూషణ్‌ను అరెస్టు చేయాలని, నిరసన తెలుపుతున్న మహిళా మల్లయోధులకు భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఐద్వా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు పి.మాణిక్యం, ఎస్.అరుణ, సంయుక్త కార్యదర్శి కె.ప్రసన్న, ఉపాధ్యక్షులు కెవి.సూర్యప్రభ, ఐద్వా కార్యకర్తలు పాల్గొన్నారు.