May 30,2023 22:57

ప్రజాశక్తి-వన్‌టౌన్‌: ఢిల్లీలో మహిళా రెజ్లర్ల అక్రమ అరెస్టులను ఖండిస్తూ ఎస్‌ఎఫ్‌ఐ, ఐద్వా, డివైఎఫ్‌ఐ, సిఐటియు ఆధ్వర్యంలో వాగు సెంటర్‌ దగ్గర మంగళవారం నిరసన తెలిపారు. ఈ సందర్భంగా డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి జి.రామన్న, ఎస్‌ఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.సోమేశ్వరరావు, ఐద్వా నగర కార్యదర్శి గాదె ఆదిలక్ష్మి, సిఐటియు నగర కార్యదర్శి నారాయణ మాట్లాడుతూ మహిళా రెజ్లర్లు తమపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఆల్‌ ఇండియా రెజ్లింగ్‌ ఫెడరేషన్‌ అధ్యక్షులు, బిజెపి ఎంపి బ్రిజ్‌ భూషణ్‌ శరణ్‌ సింగ్‌పై చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ నెల రోజులకు పైగా ఢిల్లీ జంతర్‌ మంతర్‌ వద్ద నిరవధిక ఆందోళన సాగిస్తున్నారన్నారు. బాధితులని నోరెత్తకుండా చేస్తూ నిందితుల్ని కాపాడడానికి దాడులకు, బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ నూతన పార్లమెంటు భవనం వద్దకు వెళుతున్న మహిళా రెజ్లర్లను, మద్దతుగా వస్తున్న వారిని పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారని, బలవంతంగా అదుపులోకి తీసుకున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్‌ఐ ఎన్టీఆర్‌ జిల్లా కార్యదర్శి ఎన్‌.నాగేశ్వరావు, శ్రామిక మహిళ జిల్లా కన్వీనర్‌ పి.కమల, సిపిఎం 50 డివిజన్‌ కార్పొరేటర్‌ బోయి సత్తిబాబు, సూరిబాబు తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-విజయవాడ: ఢిల్లీలో న్యాయం కోసం పోరాడుతున్న రెజ్లర్లకు మద్దతుగా ఐద్వా, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు, పిఒడబ్ల్యు, సిఐటియు, డివైఎఫ్‌ఐ, ఎస్‌ఎఫ్‌ఐ, ఇతర ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విజయవాడ లెనిన్‌సెంటర్లో కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించారు. రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బిజెపి ఎంపీ బ్రిజ్‌ భూషణ్‌ శరన్‌సింగ్‌ను తక్షణమే అరెస్ట్‌ చేయాలని, అతనిని ఎంపి పదవి నుంచి తొలగించాలని, రెజ్లర్లకు న్యాయం చేయాలని, రెజ్లర్ల అక్రమ అరెస్ట్‌లను ఖండించాలని నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి దుర్గాభవాని, ఐద్వా జిల్లా కార్యదర్శి కె శ్రీదేవి, పిఒడబ్ల్యు నాయకులు పి పద్మ, సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్‌సిహెచ్‌ శ్రీనివాస్‌, డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శి నాగేశ్వరరావు, ఎస్‌ఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు ఎమ్‌.సోమేశ్వరరావు, డివైఎఫ్‌ఐ జిల్లా అధ్యక్షులు పి.కష్ణ, సిఐటియు జిల్లా అధ్యక్షులు ఎ.వెంకటేశ్వరరావు, నగర అధ్యక్షులు కె.దుర్గారావు ఐద్వా నాయకులు ఝాన్సీ, గాదె ఆదిలక్ష్మి, ఎన్‌ఎఫ్‌ఐడబ్ల్యు నాయకులు ఓర్సు భారతి, చైతన్య మహిళా సంఘం నాయకులు రాధా, ఏఐవైఎఫ్‌ నాయకులు లంకా గోవిందరాజులు, పిడిఎస్‌యు నాయకులు రాజేష్‌, రవిచంద్ర పాల్గొన్నారు.